Nara Lokesh

Nara Lokesh: 2029 నాటికి మరో 3 డీఎస్సీలు.. ఏటా నోటిఫికేషన్ ఇస్తాం 

Nara Lokesh: విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఉపాధ్యాయులనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

రాష్ట్ర విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ (DSC) నిర్వహిస్తామని, 2029 నాటికి రాష్ట్రంలో మరో మూడు డీఎస్సీలు తీసుకొస్తామని నిరుద్యోగులకు, అభ్యర్థులకు భరోసా ఇచ్చారు.
14 డీఎస్సీలు వేసిన రికార్డు చంద్రబాబుదే..
గతంలో తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో ఏకంగా 14 డీఎస్సీల ద్వారా 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదని లోకేశ్ గుర్తు చేశారు.
“కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. కనీసం డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా కూడా తెలియని వారు నేడు ప్రభుత్వంపై అవగాహనారాహిత్యంతో విమర్శలు చేస్తున్నారు” అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
విద్యా వ్యవస్థలో సంస్కరణలు – ప్రాక్టికల్ లెర్నింగ్..
మన ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు విదేశాలకు పంపించి అధ్యయనం చేయిస్తున్నామని తెలిపారు. అక్కడ నేర్చుకున్న ఉత్తమ పద్ధతులను మన బడుల్లో అమలు చేయాలన్నారు.
నేటి ఆధునిక కాలపు అవసరాలు, సాంకేతికతకు అనుగుణంగా పాఠశాల సిలబస్‌ను మారుస్తున్నామని చెప్పారు. పుస్తకాల్లో బట్టీ పట్టే చదువులు కాకుండా ప్రాక్టికల్ విద్య అందిస్తేనే పిల్లలు భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. నిడమర్రులో ఏర్పాటు చేసిన ‘లీప్ స్కూల్ మోడల్’ ఇందుకు నిదర్శనమన్నారు.

ప్రభుత్వ బడుల ముందు ‘నో అడ్మిషన్’ బోర్డులు కనిపించాలి

పిల్లల జీవితాలను తీర్చిదిద్దే, వారి ప్రవర్తనను సరిదిద్దే అద్భుతమైన శక్తి ఉపాధ్యాయులకే ఉందని లోకేశ్ కొనియాడారు. కేవలం మార్కులు మాత్రమే కాకుండా విద్యార్థుల మానసిక ఎదుగుదల, వారిలోని ఆలోచనా విధానం, ప్రవర్తన మార్పులను ఉపాధ్యాయులు నిశితంగా గమనించి సరైన మార్గదర్శనం చేయాలని కోరారు.

కూటమి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ప్రభుత్వ బడి ముందు ‘హౌస్‌ఫుల్ – నో అడ్మిషన్స్’ బోర్డులు పెట్టే స్థాయికి సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *