tpcc-chief-mahesh-kumar-goud-chitchat-no-cabinet-expansion-konda-surekha-dismissal-aicc-decision

Mahesh Kumar Goud: ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేదు.. సురేఖపై వేటు AICC నిర్ణయమే

Mahesh Kumar Goud: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మాజీ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారాలపై టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ కీలక విషయాలను వెల్లడించారు. గాంధీభవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన, రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజులుగా సాగుతున్న ప్రచారాలకు తెరదించారు. రాష్ట్రంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణ గురించి అసలు ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన తేల్చిచెప్పారు.

ఢిల్లీలో విస్తరణపై చర్చలేదు – అంతా రేవంత్ ఇష్టం..

ఢిల్లీలో ఏఐసీసీ (AICC) పెద్దలతో జరిగిన సమావేశంలో కేవలం మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణా ఉల్లంఘన అంశం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మార్పు గురించే చర్చించామని తెలిపారు.
ఖాళీగా ఉన్న బెర్త్‌లను ఎప్పుడు భర్తీ చేయాలనేది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచక్షణాధికారమని, ఆయన నిర్ణయం మేరకే విస్తరణ తేదీలు ఖరారవుతాయని మహేష్‌గౌడ్ పేర్కొన్నారు.

సురేఖ బర్తరఫ్ పూర్తిగా ఏఐసీసీ నిర్ణయమే..

కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్న నిర్ణయం పూర్తిగా కాంగ్రెస్ హైకమాండ్ (AICC) తీసుకున్నదేనని స్పష్టం చేశారు. తాము ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేసి, వేటు పడకుండా ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ క్రమశిక్షణ విషయంలో ఏఐసీసీ అత్యంత సీరియస్‌గా ఉందని చెప్పారు.
పార్టీ నియమావళిని అతిక్రమిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవన్న సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అధిష్ఠానం ఈ కఠిన నిర్ణయం తీసుకుందని, అందుకే ప్రభుత్వ పరంగా బర్తరఫ్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. మహేష్‌గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి స్వయంగా కక్షగట్టి ఈ నిర్ణయం తీసుకున్నారంటూ సురేఖ చేసిన ఆరోపణలకు అధిష్ఠానం వైపు నుంచే నేరుగా గట్టి బదులు లభించినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *