Nepal Floods: క్షణాల వ్యవధిలో విరుచుకుపడిన పెను వరదలు నేపాల్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసేశాయి. కంటిముందే ఇల్లులు కూలిపోయి, సొంతవాళ్లు ప్రవాహంలో కొట్టుకుపోతుంటే నిస్సహాయంగా చూసిన వేలాది మంది.. బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, బయటపడిన ఆ అభాగ్యులకు కష్టాలు తీరలేదు సరికదా, ఇప్పుడు మరో తీవ్రమైన గండం పొంచి ఉంది. కడుపు నింపుకోవాల్సిన ఆహారమే ఎక్కడ రోగాల బారిన పడేస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది.
శిథిలాల మధ్య జీవచ్ఛవాలుగా బతుకులు
తీవ్రంగా నష్టపోయిన బాధితుల కోసం ప్రభుత్వ పాఠశాలలు, తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఒక్క పూట తిండి కోసం బాధితులు గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోంది. ‘రిలీఫ్ కార్డులు’ చేతపట్టుకుని బియ్యం, పప్పులు, మంచినీళ్ల బాటిళ్ల కోసం కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు.
అయితే, శిబిరాల చుట్టూ ఇంకా తొలగించని వరద బురద, కూలిన భవనాల శిథిలాలు, వాటి కింద కుళ్లిపోతున్న మృతదేహాలు గుట్టలుగా ఉన్నాయి. పరిసరాలన్నీ తీవ్ర దుర్వాసనతో, ఈగలు, పురుగులతో నిండిపోయాయి. దీంతో సహాయంగా అందుతున్న ఆహారం కలుషితమై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తుండటంతో, తినే ప్రతి ముద్దకూ బాధితులు వణికిపోతున్నారు.
రేపటి గురించి తలచుకుంటేనే భయమేస్తోంది..
మా ఇల్లు కళ్లముందే కొట్టుకుపోయింది. పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బంతా మట్టిపాలైంది. మేం రోజువారీ కూలీలం.. మళ్లీ ఓ గూడు కట్టుకునే స్తోమత మాకు లేదు. మా భవిష్యత్తు ఏంటో గుర్తొస్తేనే గుండె తరుక్కుపోతోంది” అంటూ బాధితులు రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
1,400కు చేరువలో మరణాలు.. కలరా ముప్పు!
వరద మిగిల్చిన విషాదం లెక్కలకు అందనంతగా ఉంది. పోలీసుల తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య ఇప్పటికే 1,344కు చేరింది. మరో 5,000 మందికి పైగా ఆచూకీ ఇంకా దొరకలేదు. కలుషితమైన తాగునీరు, అపరిశుభ్ర వాతావరణం వల్ల కలరా, తట్టు (మీజిల్స్) వంటి మహమ్మారులు ప్రబలే ప్రమాదం ఉండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అత్యవసరంగా లక్ష మందికి కలరా వ్యాక్సిన్లు, 75,000 మంది చిన్నారులకు తట్టు నివారణ టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయిన నేపాల్ ప్రజలు.. అటు ఆకలితో, ఇటు అంటువ్యాధుల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారికి తక్షణ వైద్యం, సురక్షితమైన ఆహారం అందించడమే ప్రస్తుతం అతిపెద్ద సవాలుగా మారింది.
