Child Rescue: మూడు నెలల పాటు కంటిమీద కునుకు లేకుండా తల్లడిల్లిన తల్లిదండ్రుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. గుంటూరు నగరంలో పదో తరగతి చదువుతున్న బాలికను పక్కా పథకం ప్రకారం అపహరించి, పోలీసుల కళ్లుగప్పి దేశమంతా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు షేక్ జాన్‌సైదా చివరికి హరియాణాలో చిక్కాడు. అతడిని పట్టించింది మరేదో కాదు.. ఆ బాలిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తల్లిదండ్రుల ఫోన్‌కు వచ్చిన ఒకే ఒక్క మిస్డ్ కాల్!
పక్కా ప్లాన్‌తో ట్రాప్ చేశాడు..
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. నిందితుడు జాన్‌సైదా జూన్ 9న బాలికను అపహరించడానికి ముందే వారం రోజుల పాటు గుంటూరులోని ఓ లాడ్జిలో తిష్టవేశాడు. సెకండ్‌హ్యాండ్ బైక్, గుర్తుతెలియని సిమ్ కార్డులను సమకూర్చుకున్నాడు. బాలిక ఫోన్‌కు నిరంతరం మెసేజ్‌లు పంపుతూ మాయమాటలతో ఆమెను నమ్మించాడు. ఇంటి నుంచి బయటకు రప్పించేటప్పుడు ఆధారాలు దొరక్కుండా చాకచక్యంగా మెసేజ్‌లన్నీ డిలీట్ చేయించి, ఆ ఫోన్‌ను మురుగు కాలువలో పారేయించాడు.
రాష్ట్రాలు మారుస్తూ సినిమా తరహాలో ఎస్కేప్!
బాలికను బైక్‌పై నెల్లూరుకు తీసుకెళ్లిన నిందితుడు, అక్కడ బైక్ వదిలేసి స్నేహితుల సాయంతో దుస్తులు మార్చుకుని చెన్నై, కోయంబత్తూరు, కేరళ మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడ ఓ బంధువు ఇంట్లో తలదాచుకుంటూ బంగారం అమ్మే ప్రయత్నం చేశాడు. నిందితుడు సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడకుండా కేవలం ఇన్స్టాగ్రామ్ మెసేజ్‌లను మాత్రమే ఉపయోగించాడు. పోలీసులు సీసీటీవీల ఆధారంగా ట్రాక్ చేస్తూ ఒక ప్రాంతానికి వెళ్లేసరికి, అక్కడి నుంచి మరో రాష్ట్రానికి మకాం మార్చేవాడు. జాన్‌సైదా ఒక్కడే ఏడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు మారుస్తూ పోలీసులకు సవాల్ విసిరాడు.
హైకోర్టు ఆగ్రహం.. ఒత్తిడిలో దర్యాప్తు బృందాలు
తన కుమార్తె ఆచూకీ తెలియక గుండెలు పగిలేలా రోదించిన తండ్రి, చివరికి హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ కేసులో పోలీసుల పనితీరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దర్యాప్తు బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నా నిందితుడి జాడ చిక్కలేదు.
ఆ ఒక్క మిస్డ్ కాల్‌తో దొరికిపోయాడు!
అలాంటి ఉత్కంఠభరిత సమయంలో గురువారం రాత్రి బాలిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తల్లిదండ్రుల ఫోన్‌కు అకస్మాత్తుగా ఒక మిస్డ్ కాల్ వచ్చింది. ఆ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయింది. ఆ చిన్నపాటి క్లూను పట్టుకున్న పోలీస్ ఐటీ విభాగం క్షణాల్లో రంగంలోకి దిగింది. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి, ఆ సిగ్నల్ హరియాణాలోని కర్నాల్ సమీపంలోని బుధాఖేరా ప్రాంతం నుంచి వచ్చినట్లు కనిపెట్టారు.
వెంటనే శుక్రవారం ఉదయమే గుంటూరు ప్రత్యేక పోలీస్ బృందం హరియాణాకు చేరుకుంది. స్థానిక పోలీసుల సహకారంతో అక్కడి ఓ హోటల్‌ను చుట్టుముట్టి నిందితుడు జాన్‌సైదాను అదుపులోకి తీసుకుంది. బాలికను సురక్షితంగా కాపాడి, ఇద్దరినీ గుంటూరుకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ కిడ్నాప్‌కు సహకరించిన స్నేహితులు, బంధువుల వివరాలను సైతం పోలీసులు సేకరిస్తున్నారు. మూడు నెలల పాటు నరకం చూసిన ఆ బాలిక తల్లిదండ్రులు తమ బిడ్డ క్షేమంగా దొరికిందన్న వార్త విని ఊపిరి పీల్చుకున్నారు.
