Clothes: ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎంత వేగంగా మారిపోతోందంటే.. మార్కెట్లోకి రోజుకో కొత్త ట్రెండ్, సరికొత్త డిజైన్లు వస్తూనే ఉన్నాయి. కొత్త బట్టలు రాగానే పాతవాటిని పక్కన పడేయడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. కానీ కాస్త శ్రద్ధ పెట్టి, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పాత దుస్తులను కూడా కొత్తవాటిలా ఎన్నో ఏళ్లపాటు చక్కగా వాడుకోవచ్చు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేసినవాళ్లమవుతాం. మీ దుస్తుల నాణ్యత తగ్గకుండా, ఎక్కువ కాలం మన్నేలా చూసుకోవడానికి నిపుణులు చెబుతున్న సులభమైన మార్గాలివే..
లేబుల్‌పై ఉన్న సూచనలు గమనించండి
ప్రతి బట్టకు ఒక నిర్దిష్టమైన వాషింగ్ పద్ధతి ఉంటుంది. చొక్కా లేదా టీషర్ట్ లోపల ఉండే లేబుల్‌పై చన్నీళ్లతో ఉతకాలా, వేడినీళ్లతో ఉతకాలా, మిషీన్ వాష్ చేయొచ్చా లేదా అనే వివరాలు ఉంటాయి. వాటిని చదివి ఉతకడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఇన్నర్‌వేర్, జిమ్ బట్టలు, నైట్‌వేర్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. అవసరం లేకపోయినా మాటిమాటికీ బట్టలను మెషీన్‌లో వేసి ఉతకడం, తీవ్రమైన ఎండలో గంటల తరబడి ఎండబెట్టడం వల్ల రంగు వెలిసిపోయి, ఫ్యాబ్రిక్ సాగిపోతుంది.
ఒకే డ్రెస్.. సరికొత్త స్టైల్!
ఒకసారి ఫంక్షన్‌కు వేసుకున్న బట్టలను మళ్లీ వేసుకోకూడదనే నియమమేమీ లేదు. కాస్త క్రియేటివిటీ జోడిస్తే ఒకే దుస్తులతో నాలుగైదు సరికొత్త లుక్స్ క్రియేట్ చేయవచ్చు. ఒక సాధారణ కుర్తీ లేదా టాప్‌ను జీన్స్, పలాజో లేదా లాంగ్ స్కర్ట్‌తో జత చేసి వేసుకోవచ్చు. దుపట్టా మార్చడం, జాకెట్ లేదా శ్రగ్ జతచేయడం, లేదా చిన్న చిన్న యాక్సెసరీస్ (చెవిదిద్దులు, బెల్ట్) వాడటం ద్వారా పాత దుస్తులకు కూడా సరికొత్త లుక్ ఇవ్వొచ్చు.
వస్త్రం తీరును అర్థం చేసుకోండి
కాటన్, పట్టు, ఊలు, సింథటిక్.. ఇలా ప్రతి ఫ్యాబ్రిక్‌కు ప్రత్యేకమైన సంరక్షణ అవసరం. స్వెటర్లు లేదా ఉన్ని బట్టలపై చిన్న బూజు (లింట్) వచ్చినప్పుడు ఉతకడానికి బదులు లింట్ రోలర్ లేదా చిన్న బ్రష్‌తో శుభ్రం చేస్తే సరిపోతుంది. దీనివల్ల వస్త్రం పాతబడకుండా ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
చిరిగితే పారేయకండి.. మరమ్మతు చేయండి!
బట్టలకు ఎక్కడైనా చిన్న కుట్టు ఊడినా, బటన్ పోయినా వెంటనే చెత్తబుట్టలో వేయాల్సిన అవసరం లేదు. చిన్నపాటి రిపేర్లతో వాటిని మళ్లీ అందంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు పాత బట్టలను రీ-మోడలింగ్ చేసుకోవడం కూడా పెద్ద ట్రెండ్‌గా మారింది. పాత చీరలను అనార్కలీలుగా, పాత జీన్స్‌ను షార్ట్స్‌గా లేదా బ్యాగులుగా మార్చుకోవడం చక్కటి మార్గం.
దాచే పద్ధతిలోనూ జాగ్రత్తలు ముఖ్యం
బట్టలు ఉతికినంత మాత్రాన సరిపోదు, వాటిని వార్డ్‌రోబ్‌లో ఎలా సర్దుతున్నామనేది కూడా ఎంతో కీలకం. భారీ చీరలు, సూట్లు, జాకెట్లను హాంగర్లకు వేలాడదీయడం మంచిది. అలాగే టీషర్ట్స్, నిట్టెడ్ బట్టలను వేలాడదీస్తే వాటి ఆకారం పాడయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని చక్కగా మడతపెట్టి నిల్వ చేయాలి. తేమ, బూజు పట్టకుండా వార్డ్‌రోబ్‌లో నాఫ్తలీన్ గోళీలు లేదా వేపాకులు ఉంచితే మంచిది.
