Revanth Reddy

Revanth Reddy: నేనూ సర్కారు బడిలో చదివే సీఎం అయ్యా

Revanth Reddy: సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రెండో రోజు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయుల దినోత్సవ (టీచర్స్ డే) వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫోటో సోషల్ ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఉపాధ్యాయ బృందంతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగుతూ వారితో ఆత్మీయంగా గడిపారు. ఈ వేడుకల్లో ఉత్తమ సేవలు అందించిన 123 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం తరఫున సత్కరించారు అయన తర్వాత ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడారు.

28 నుంచి 17వ స్థానానికి.. క్రెడిట్ అంతా మీదే!
 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి విద్యా ప్రమాణాల్లో తెలంగాణ దేశంలోనే 28వ స్థానంలో ఉండేది. కానీ ఈరోజు మనం 17వ స్థానానికి ఎదిగామంటే ఆ ఘనత, క్రెడిట్ అంతా మన ఉపాధ్యాయులదే. దేశమంతటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంటే, తెలంగాణలో మాత్రం సర్కారు బడుల్లో అడ్మిషన్లు వెల్లువెత్తుతున్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏకంగా 95 శాతం సీట్లు భర్తీ కావడమే ఇందుకు నిదర్శనం. మన టీచర్లు దృఢంగా సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదు” అని అన్నారు.
సర్కారు బడి చదువే నన్ను ఈ స్థాయికి తెచ్చింది
దేశంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారే. నేను కూడా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. ఆ సర్కారు బడి చదువే నన్ను ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబెట్టింది.
అడగకముందే ప్రమోషన్లు.. 55 రోజుల్లోనే 10 వేల ఉద్యోగాలు
గత పాలకుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడుతూ, తమ ప్రభుత్వం ఉపాధ్యాయుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
  • సమస్యల పరిష్కారం: గత 15-20 ఏళ్లుగా నిలిచిపోయిన టీచర్ల ప్రమోషన్లు, బదిలీల సమస్యలను నేను అధికారంలోకి రాగానే, మీరు అడగకముందే పరిష్కరించా. 317 జీవో సమస్యలను చక్కదిద్దాం. పదవీ బాధ్యతలు చేపట్టిన కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ ద్వారా 10 వేల మంది ఉపాధ్యాయులను ప్రభుత్వ బడులకు అందించాం.
  • కేకే కమిటీ సంస్కరణలు: తెలంగాణ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగా, కేకే కమిటీ ద్వారా పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలు నేర్చుకునేందుకు ఉపాధ్యాయులను విదేశీ పర్యటనలకు కూడా పంపామని గుర్తుచేశారు.
గత పాలకులు వేల కోట్లు అప్పులు చేసి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారు
గత పదేళ్లలో ఒకే కుటుంబం రాష్ట్రాన్ని ఏకంగా రూ. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టింది. ప్రతి నెలా వందలాది మంది ఉద్యోగులు రిటైర్ అవుతుంటే, ఒక్కో ఉద్యోగికి సగటున రూ. కోటి దాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం గాలికొదిలేసింది. వేల కోట్ల బాకీలు పెట్టి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారు. కానీ మనం బాధ్యత తీసుకున్నాక పెండింగ్ రిటైర్మెంట్ బకాయిలను విడుదల చేశాం. పీఆర్సీ, పెండింగ్ జీతభత్యాల సమస్యలను కూడా మీరు అడగకముందే పరిష్కరిస్తా.”
మీరు రెండేళ్లు సమయం ఇవ్వండి.. తర్వాత నాకే మార్కులు వేయండి!
నేను అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా పనిచేశాను. గతంలో ఇంకొకాయన వెయ్యి రోజుల్లో ఒక్క రోజు కూడా బయటకు రాలేదు. రాజకీయాల్లో మేము ఐదేళ్లకోసారి పరీక్ష రాస్తాం.. ఆ పేపర్లు దిద్ది తీర్పునిచ్చేది మీరే కదా! ఉపాధ్యాయులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం నన్ను ఎంతగానో బాధించింది. నాకు ఇంకో రెండేళ్ల సమయం ఇవ్వండి.. మీ సమస్యలన్నీ తీర్చే బాధ్యత నాది. మీరు మాత్రం విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టిపెట్టి గట్టిగా పనిచేయండి. 2028 డిసెంబర్‌లో గానీ, 2029 మార్చిలో గానీ ఎన్నికలు వస్తాయి. ఆరోజు నేను రాసే పరీక్షకు మీరే నిష్పక్షపాతంగా మార్కులు వేయండి.”
నర్సరీ స్థాయి నుంచే 12వ తరగతి వరకు సమగ్ర విద్యా సంస్కరణలు అమలు చేస్తూ, నూతన జాతీయ విద్యా విధానాన్ని (NEP) రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా అనుసరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *