Krishna Kubja Temple

Krishna Kubja Temple: రాధ లేని కృష్ణుడి ఆలయం చూశారా?

Krishna Kubja Temple: శ్రీకృష్ణాష్టమి వచ్చిందంటే చాలు.. మథుర, బృందావనం నుంచి మొదలుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతాయి. సాధారణంగా మనం ఏ కృష్ణుడి గుడికి వెళ్లినా, కన్నయ్య పక్కన రాధారాణి లేదా రుక్మిణీదేవి కొలువై ఉండటాన్ని చూస్తుంటాం.

కానీ, రాధమ్మ లేని ఒక విచిత్రమైన కృష్ణుడి ఆలయం ఉందని మీకు తెలుసా? కృష్ణుడి జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో సుమారు 500 ఏళ్ల నాటి ఒక ప్రాచీన ఆలయం ఉంది. అక్కడ శ్రీకృష్ణుడి సరసన రాధ ఉండదు.. లోకం వెక్కిరించిన ఒక పరమ భక్తురాలు పూజలందుకుంటోంది. అదే ప్రసిద్ధ ‘శ్రీకృష్ణ కుబ్జ మందిరం’. స్వామివారిని దర్శించుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
చర్మవ్యాధులను దూరం చేసే మహిమాన్విత క్షేత్రం..
ఈ మందిరంలోకి అడుగుపెట్టి కన్నయ్యను, ఆయన పక్కనున్న కుబ్జను దర్శించుకుంటే ఎలాంటి చర్మ సమస్యలైనా తొలగిపోతాయని స్థానికుల నమ్మకం. ప్రపంచంలోనే ఇలాంటి విశిష్టత ఉన్న ఏకైక ఆలయం ఇదేనని చెబుతారు. ఇక్కడి పవిత్ర జలంతో స్నానం చేసి, స్వచ్ఛమైన మనసుతో వేడుకుంటే దీర్ఘకాలిక చర్మ వ్యాధుల నుంచి విముక్తి లభించి, శరీరానికి సహజ సౌందర్యం చేకూరుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే దేశం నలుమూలల నుంచి ఎంతోమంది ఇక్కడికి తరలివస్తుంటారు.
ఇంతకీ ఎవరీ కుబ్జ? సమాజం ఎందుకు హేళన చేసింది?..
పురాణాల ప్రకారం.. కుబ్జ మథురను పాలించిన కంసుడి వద్ద సుగంధ ద్రవ్యాలు తయారుచేసే పరిచారిక (దాసి). పుట్టుకతోనే ఆమె మూపురం కలిగి ఉండి, శారీరక వైకల్యంతో సరిగ్గా నిలబడలేకపోయేది. రూపురేఖలు కూడా ఆకర్షణీయంగా లేకపోవడంతో చిన్నప్పటి నుంచి సమాజం నుంచి తీవ్ర అవమానాలు ఎదుర్కొంది. ఊరి జనం ఆమె వైకల్యాన్ని చూసి వెక్కిరించేవారు, గేలిచేసేవారు. ఆ నిందలు, మాటల బాణాలతో ఆమె తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తూ బతికేది.
స్వామివారి దివ్య స్పర్శ – దాసి జీవితం ధన్యం..
శ్రీకృష్ణుడు, బలరాములు తొలిసారిగా మథుర నగరంలోకి ప్రవేశించినప్పుడు రాజమార్గంలో సుగంధ ద్రవ్యాల గిన్నె పట్టుకుని వెళ్తున్న కుబ్జ తారసపడింది. ఆమెను చూడగానే కన్నయ్య ప్రేమగా ‘సుందరీ!’ అని సంబోధించాడు. జీవితాంతం అవమానాలే విన్న ఆ అభాగ్యురాలు, ఈ యువకుడు కూడా తనను చూసి ఎగతాళి చేస్తున్నాడనుకుని కళ్లనిండా నీళ్లు నింపుకుంది.
తన భక్తురాలి కన్నీరు చూసిన పరమాత్ముడు వెంటనే ఆమె వద్దకు వెళ్లాడు. ఆమె పాదంపై తన పాదాన్ని ఉంచి, గడ్డం కింద వేళ్లు ఆనించి ఆమె తలను సున్నితంగా పైకి ఎత్తాడు. ఆ దివ్య స్పర్శ తగిలిన మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది. వంగిపోయిన ఆమె వెన్నుపూస ఒక్కసారిగా నిటారుగా మారిపోయింది. ఆమె శరీరంలోని లోపాలన్నీ మాయమై, క్షణాల్లో అపురూప సౌందర్యవతిగా మారిపోయింది.
ఆ తర్వాత కుబ్జ పరమ భాగవతోత్తమురాలై శ్రీకృష్ణుడి భక్తిలో లీనమైపోయింది. భగవంతుడు బాహ్య సౌందర్యాన్ని కాదు, అంతఃసౌందర్యాన్ని, నిష్కల్మషమైన భక్తినే చూస్తాడనడానికి నిదర్శనంగా ఈ క్షేత్రంలో కృష్ణుడి సరసన కుబ్జకు స్థానం కల్పించారు.
ఆలయానికి ఎలా చేరుకోవాలి?

ఈ విలక్షణ ఆలయాన్ని దర్శించాలనుకునే భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని మథుర నగరానికి చేరుకోవాలి. మథురలోని సుప్రసిద్ధ పరిక్రమ మార్గంలోనే ఈ 500 ఏళ్ల నాటి చారిత్రక మందిరం కొలువై ఉంది. రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ నుంచి ఆటోలు, రిక్షాల ద్వారా సులభంగా చేరుకుని స్వామివారి అనుగ్రహం పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *