Konda Surekha

Konda Surekha: మంత్రి పదవి ఒక ఆభరణం మాత్రమే.. రాజీనామా చేయను

Konda Surekha: తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు సిఫార్సు లేఖ పంపిన వ్యవహారంపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె, ప్రభుత్వ తీరును ఎండగడుతూ భావోద్వేగపూరిత, సంచలన వ్యాఖ్యలు చేశారు.

కనీసం వివరణ కూడా కోరకుండా ఏకపక్షంగా తనను కేబినెట్ నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఉరిశిక్ష అమలు చేసేముందు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు.. అలాంటిది నన్ను క్యాబినెట్ నుంచి తీసేసేటప్పుడు నా సంజాయిషీ తీసుకోరా?” అని ఆమె నిలదీశారు.
హైకమాండ్‌ను రేవంత్ బ్లాక్‌మెయిల్ చేశారు..
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశారని సురేఖ ఆరోపించారు. “సురేఖనైనా తొలగించండి.. లేకపోతే నేనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతా” అని రేవంత్ పార్టీ పెద్దలకు అల్టిమేటం ఇచ్చి తనపై వేటు వేయించారని ఆమె పేర్కొన్నారు.
తనపై కుట్ర చేసి పదవి నుంచి తప్పించడంలో కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆమె నేరుగా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ మూలాలు ఉన్నవారిని తీసుకొచ్చి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. తన మాజీ ఓఎస్డీ సుమంత్‌పై కక్షగట్టి అక్రమ కేసులు పెట్టారని, ఆ కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కూతురి వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు?..
తన కుమార్తె సుస్మిత స్వతంత్ర మహిళ అని, మహిళలకు స్వేచ్ఛ ఉండాలని రాహుల్ గాంధీయే స్వయంగా చెబుతున్నారని గుర్తు చేశారు. “ఆమె చేసిన వ్యాఖ్యలకు నన్ను ఎలా బాధ్యురాలిని చేస్తారు? ఆమె మాట్లాడిన దాంట్లో నేను తప్పుబట్టాల్సింది ఏమీ లేదు.. నేను ఖండించాల్సిన అవసరమూ లేదు” అని స్పష్టం చేశారు.
జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు గతంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. గతంలో పార్టీని తిట్టిన మల్లు రవి లాంటి నేతలతో నేడు తనపై క్రమశిక్షణా సిఫార్సులు చేయించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రూ.50 కోట్లు పెట్టి పీసీసీ కొన్నారన్న ఆరోపణలు చేసినవారిపై ఎందుకు వేటు వేయలేదని నిలదీశారు.

మంత్రి పదవి ఒక ఆభరణం మాత్రమే – రాజీనామా చేయను

తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం లేదని, వరంగల్ ఈస్ట్ శాసనసభ్యురాలిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. మంత్రి పదవి తనకు ఒక అలంకారం మాత్రమేనని, ఆ పదవి పోయిందన్న బాధ ఏమాత్రం లేదని చెప్పారు. అయితే, గౌరవప్రదంగా కాకుండా ఇలా అర్ధంతరంగా తీసేయడాన్నే జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు.
తనపై కక్షసాధింపులో భాగంగా సీనియర్ నేత జి. చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం నుంచి తప్పించడం ముమ్మాటికీ అన్యాయమన్నారు. అయితే, తన కారణంగా ముగ్గురు బీసీ మహిళలకు (సుధారాణి, విజయలక్ష్మి, నేరెళ్ల శారద) కీలక పదవులు దక్కడం తనకు సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

వైఎస్సార్ తర్వాత తాను రేవంత్ రెడ్డినే ఎక్కువగా అభిమానించానని, కానీ ముక్కుసూటిగా ఉండే తమపైనే కక్షకట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయేది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలని, ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని, సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని సురేఖ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *