KTR: తెలంగాణను దేశానికే ధాన్యాగారంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కళ్లముందే పంటలు ఎండిపోయి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన ‘రైతు మహాధర్నా’ (రైతు సదస్సు) వేదికగా ఆయన కాంగ్రెస్ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ‘రైస్ బౌల్’గా మారిన మిర్యాలగూడ గడ్డపై నేడు రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి రావడం దారుణమని ఆయన మండిపడ్డారు.
రైతుబంధుకు రాంరాం.. మోసపూరిత హామీలు.. కేటీఆర్ విమర్శలు
ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారని, వడ్లకు బోనస్ ఊసేలేదని, కౌలు రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు.
“కేసీఆర్ రైతుబంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తే, తాము రూ.15 వేలు ఇస్తామని ఆశచూపిన కాంగ్రెస్.. వరుసగా మూడు సీజన్లలో రైతుబంధుకు పాతరేసింది. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అవుతుందని, యూరియా కోసం చెప్పులు లైన్లలో పెట్టే రోజులొస్తాయని కేసీఆర్ ఆనాడే చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా అదే జరుగుతోంది” అని కేటీఆర్ విమర్శించారు. రైతుబీమాను సైతం ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
“సాగర్‌లో నీళ్లున్నా.. రైతుల కంట్లో కన్నీళ్లే”
నల్లగొండ జిల్లాకే చెందిన ఇద్దరు మంత్రులు కేబినెట్లో ఉన్నప్పటికీ సాగర్ ఆయకట్టుకు నీరివ్వడంలో చేతులెత్తేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. జలాశయంలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నా, పొలాలకు విడుదల చేయకపోవడంతో చేలు ఎండిపోతున్నాయని, నీళ్ల కోసం అడిగిన రైతులపై ఎదురు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి హక్కుల కోసం నాడు కేసీఆర్ కోదాడ నుంచి హాలియా దాకా పాదయాత్ర చేశారని, తెలంగాణ వచ్చాక టంచన్‌గా సాగర్ నీళ్లు ఇచ్చి చివరి ఆయకట్టు దాకా పంటలు పండించారని గుర్తు చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతల మాటల వలలో పడి ప్రజలు మోసపోయారని అన్నారు.
వినాయక చవితిలోపు షెడ్యూల్ ఇవ్వాలి – కేటీఆర్ అల్టిమేటం
పంటలను కాపాడేందుకు వినాయక చవితి లోపే ప్రభుత్వం నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సాగునీటి శాఖ మంత్రి తక్షణమే స్పందించి ప్రకటన చేయకపోతే, వేలాది మంది రైతులతో కలిసి తామే స్వయంగా రోడ్డెక్కి ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన హెచ్చరించారు.
