Crime News

Crime News: ప్రియురాలిని కత్తితో పొడిచి చంపి, విషం తాగిన ప్రియుడు!

Crime News: దేశ రాజధాని ఢిల్లీలోని నార్త్ డిస్ట్రిక్ట్ పరిధి లాహోరీ గేట్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ‘ప్రిన్స్ హోటల్’ గదిలో 25 ఏళ్ల యువతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ప్రియుడే ఆమెను కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం నిందితుడు కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అతడిని విషమ పరిస్థితిలో ఆసుపత్రికి తరలించారు.

హోటల్ గదిలో ఏం జరిగింది?:

పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 25 ఏళ్ల యువతి తన ప్రియుడితో కలిసి లాహోరీ గేట్‌లోని ప్రిన్స్ హోటల్‌కు వచ్చి గది అద్దెకు తీసుకుంది. తొలుత ఇద్దరి ప్రవర్తన సాధారణంగానే కనిపించింది. రాత్రి లేదా గురువారం తెల్లవారుజాము సమయంలో వీరిద్దరి మధ్య ఏదో విషయమై తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది.
హత్య తర్వాత విషం తాగిన నిందితుడు..
యువతి మరణించిన విషయాన్ని గ్రహించిన నిందితుడు.. తర్వాత తన్ను కూడా మరణించాలని  అనుకోని విషం తగ్గి బలవన్మరణానికి యత్నించాడు. ఎంతసేపటికీ గది నుంచి ఎటువంటి అలజడి లేకపోవడం, అనుమానాస్పద పరిస్థితులు కనిపించడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. లాహోరీ గేట్ పోలీసులు వచ్చి గదిని పరిశీలించగా.. యువతి మృతదేహమై పడి ఉండగా, యువకుడు అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. వెంటనే అతడిని లోక్ నాయక్ (LNJP) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్ – దర్యాప్తు ముమ్మరం..

పోలీసులు ఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిందితుడు ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేడని, వైద్యుల చికిత్స అనంతరం అతడు కోలుకుని స్పృహలోకి వస్తేనే హత్యకు దారితీసిన అసలు వివాదం ఏమిటనేది స్పష్టమవుతుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *