DDMS Sivashankar Arrest

DDMS Sivashankar Arrest: లంచం కేసులో డీజీఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన సీబీఐ

DDMS Sivashankar Arrest: లంచం తీసుకుంటూ ప్రభుత్వ అధికారులు పట్టుబడుతున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తున్నప్పటికీ కొందరి తీరు మారడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (DGMS) డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. రూ.2 లక్షల లంచం తీసుకున్న ఆరోపణలపై హైదరాబాద్-III రీజియన్ డీజీఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్ (మైనింగ్) యు. శివశంకర్‌తో పాటు ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, మధ్యవర్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగింది?: మైనింగ్ ప్రమాదంపై నివేదిక కోసం బేరం!
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రానైట్ క్వారీలో ప్రాణాంతక మైనింగ్ ప్రమాదం (Fatal Mining Accident) జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మైనింగ్ సంస్థకు అనుకూలంగా విచారణ నివేదిక (Favourable Enquiry Report) ఇచ్చేందుకు డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ లంచం డిమాండ్ చేశారు. వాసవి గ్రానైట్స్ సంస్థకు చెందిన సిద్ద వెంకట సురేశ్ కుమార్ నుంచి కన్సల్టెంట్/మధ్యవర్తి ఎ. సుభాస్కర్ రెడ్డి ద్వారా రూ.2 లక్షల లంచం మొత్తాన్ని అధికారి స్వీకరించినట్లు సీబీఐ గుర్తించింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్, వాసవి గ్రానైట్స్ ప్రతినిధి సురేశ్ కుమార్, మధ్యవర్తి సుభాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు.
పలు ప్రాంతాల్లో సీబీఐ ముమ్మర సోదాలు..

నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం సీబీఐ బృందాలు రంగంలోకి దిగి హైదరాబాద్ సహా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహించాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో కీలక పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *