Dhanush: కోలీవుడ్ నటుడు ధనుష్ వరుస సంచలన వ్యాఖ్యలు, సామాజిక కార్యక్రమాలతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయంలో వేడి రాజేశారు. ఇటీవలే రజనీకాంత్, కమల్ హాసన్, తాజాగా దళపతి విజయ్ వంటి అగ్ర కథానాయకులు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో.. ఇప్పుడు ధనుష్ కూడా అదే బాట పడుతున్నారా? అనే చర్చ జోరందుకుంది.
చెన్నై సాలిగ్రామంలోని తన పూర్వ విద్యాలయం ‘తాయ్ సత్య మెట్రిక్యులేషన్ హైస్కూల్’ లో తన సొంత ఖర్చులతో నిర్మించిన నూతన మూడు అంతస్తుల భవనాన్ని (‘ధనుష్ బ్లాక్’) ప్రారంభించిన ఆయన.. భాషాభిమానంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
మాతృభాష రాకపోవడం గర్వం కాదు.. అవమానకరం!
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ధనుష్ నేటి విద్యావ్యవస్థ, భాష ప్రాధాన్యంపై ఆవేదన వ్యక్తం చేశారు..
మేము చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడటం కష్టంగా ఉండేది, కానీ తమిళం బాగా వచ్చేది. కానీ ఇప్పుడు నేను కలిసే పది మందిలో ఎనిమిది మందికి ఇంగ్లీష్ బాగా వచ్చు కానీ తమ మాతృభాష అయిన తమిళం చదవడం, రాయడం రావడం లేదు. తమిళం రాదని చెప్పడం చాలామంది గర్వంగా భావిస్తున్నారు. కానీ మాతృభాష రాకపోవడం గర్వకారణం కాదు.. అది ఒక రకమైన అవమానం! ప్రతీ ఒక్కరూ మొదట తమ మాతృభాషను నేర్చుకోవాలి.— నటుడు ధనుష్
బెల్జియంలో ఒక ఫ్రాన్స్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో అక్కడి ప్రజలు తమ సొంత భాషకే ప్రాధాన్యమిస్తూ, ఇంగ్లీష్‌ను కేవలం అదనపు అర్హత (Bonus) గా మాత్రమే చూశారనే విదేశీ అనుభవాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.
విజయ్ దారిలోనే పొలిటికల్ రీ-ఎంట్రీ ప్లాన్?
ధనుష్ రాజకీయ అరంగేట్రంపై ప్రచారం జరగడానికి ప్రధానంగా రెండు విషయాలు కారణమయ్యాయి..
-
ఫ్యాన్స్ క్లబ్ జెండా ఆవిష్కరణ: తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో అభిమాన సంఘాల కోసం ఒక నూతన జెండాను ఆవిష్కరించడం కలకలం రేపింది (అయితే ఇది కేవలం సేవా కార్యక్రమాల కోసమేనని ఆ తర్వాత వివరణ ఇచ్చారు).
-
ప్రజా సేవకు పిలుపు: “సినిమా ఆడియో లాంచ్‌లు, ఫ్లెక్సీలకే పరిమితం కాకుండా.. మన చుట్టూ ఉన్న పేద ప్రజల అవసరాలను గుర్తించి సహాయం చేయండి. మన ఐక్యతకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుందాం” అని ధనుష్ పిలుపునివ్వడం.. నటుడు విజయ్ గతంలో చేసిన రాజకీయ ప్రసంగాలను గుర్తుచేస్తోంది.
తన మాతృసంస్థ పాఠశాలకు స్వయంగా రూ.కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించి ఇవ్వడం, విద్యార్థులకు భాషాభిమానం నూరిపోయడం, సేవా కార్యక్రమాలను వేగవంతం చేయడం వెనుక ధనుష్‌కు సుదీర్ఘ రాజకీయ ఆలోచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
