TGRTC Mini Buses: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెడుతూ, ప్రయాణికులకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోని ఇరుకైన కాలనీల నుంచి ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్లకు సులభంగా చేరుకునేలా మినీ బస్సులను (Mini Buses) మళ్లీ రోడ్డెక్కించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
సిటీ ప్రయాణాన్ని మరింత వేగవంతంగా, సుఖవంతంగా మార్చేందుకు ఈ ‘ఫీడర్ సర్వీసుల’ పునరుద్ధరణ ఎంతగానో ఉపయోగపడనుంది.
తొలి విడతలో 100 కొత్త బస్సులు!
ఆర్టీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ కింద మొదటి విడతలో 100 సరికొత్త మినీ బస్సులను అందుబాటులోకి తీసుకరానున్నారు.
-
పాత బస్సుల స్థానంలో: గతంలో చార్మినార్ డిపో పరిధిలో నడిపిన మినీ బస్సులు పాతబడిపోవడంతో వాటిని స్క్రాప్‌గా తొలగించారు. ఇప్పుడు ఆ స్థానంలో ఆధునిక వసతులతో కూడిన కొత్త మోడల్ బస్సులను రంగంలోకి దించుతున్నారు.
-
లాస్ట్ మైల్ కనెక్టివిటీ: ఇవి ‘సెట్విన్’ బస్సుల తరహాలో చిన్నవిగా ఉంటాయి. కాలనీలు, గల్లీల నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని సమీపంలోని మెట్రో స్టేషన్లు, ప్రధాన బస్సు స్టాండ్ల వద్ద దించే ఫీడర్ మోడల్‌లో ఇవి పనిచేస్తాయి.
ఇరుకైన గల్లీల్లోనూ నో ట్రాఫిక్ ప్రాబ్లమ్!
సాధారణ పెద్ద ఆర్టీసీ బస్సులు వెళ్లలేని ఇరుకైన వీధులు, రద్దీగా ఉండే మార్గాల్లో ఈ మినీ బస్సులు చాలా సులభంగా ప్రయాణించగలవు.
దీనివల్ల శివారు ప్రాంతాల ప్రజలకు, కాలనీ వాసులకు తమ సొంత బైకులు, కార్లు తీయాల్సిన పనిలేకుండా తక్కువ ఖర్చుతోనే మెట్రో లేదా ప్రధాన ఆర్టీసీ రూట్లకు అనుసంధానం లభిస్తుంది. ఫలితంగా ప్రధాన రహదారులపై వ్యక్తిగత వాహనాల తాకిడి తగ్గి ట్రాఫిక్ సమస్య చాలా వరకు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.
