Udhayanidhi Stalin Arrest

Udhayanidhi Stalin Arrest: ‘నో కాంప్రమైజ్’ అంటున్న టీవీకే!.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్..

Udhayanidhi Stalin Arrest: తమిళనాడు రాజకీయం తీవ్ర ఉత్కంఠభరిత ఘట్టానికి చేరుకుంది. కావేరీ నిరసన సభలో నటి త్రిష ప్రస్తావనతో మొదలైన వివాదం.. ఏకంగా ప్రతిపక్ష నేత, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకు దారితీసింది.

ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను, నటి త్రిషను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఇచ్చిన ఫిర్యాదుతో చెన్నైలోని ఉదయనిధి నివాసం వద్ద మంగళవారం ఉదయం హైడ్రామా నడుమ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

వివాదానికి మూలం ఏంటి?

తంజావూరులో జరిగిన డీఎంకే నిరసన సభలో ఉదయనిధి ప్రసంగిస్తుండగా.. సభలోని కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరుతో నినాదాలు చేశారు. దానికి స్పందించిన ఉదయనిధి, “కావేరీ నీళ్లు ఇక్కడికి వచ్చినా రాకపోయినా.. అక్కడికి మాత్రం నీళ్లు వెళ్తాయి” అని వ్యాఖ్యానించారు.

ఈ మాటలు సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశిస్తూ అత్యంత అసభ్యకరంగా, ద్వంద్వార్థం (Double Meaning) వచ్చేలా ఉన్నాయని టీవీకే పార్టీ మండిపడింది. టీవీకే తంజావూరు జిల్లా మహిళా విభాగం నిర్వాహకురాలు బైరవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉదయనిధిపై 6 విభిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఉదయనిధి ఇంటి వద్ద రణరంగం.. హైకోర్టు క్లారిటీ!

ఉదయనిధిపై కేసు నమోదు కావడంతో ఆయన నివాసం వద్ద టీవీకే నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెన్నైలోని ఆయన ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.

  • పోలీసులతో వాగ్వాదం: ఉదయనిధిని పరామర్శించేందుకు వచ్చిన డీఎంకే మాజీ మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, ఈవి వేలు, మా.సుబ్రమణ్యన్‌లతో పాటు పార్టీ లాయర్లను కూడా పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది.

  • అరెస్ట్: హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ ప్రక్రియ నడుస్తుండగానే.. తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని చెప్తూ పోలీసులు ఉదయనిధిని ఇంటి నుంచే అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యానులోకి ఎక్కించారు. ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.

  • ముందస్తు బెయిల్ పిటిషన్: మరోవైపు అరెస్టును తప్పుబడుతూ ఉదయనిధి న్యాయవాదులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఇళంతిరైయన్ బెంచ్ మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై విచారణ జరిపే వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించినప్పటికీ, ఆలోపే అరెస్ట్ ప్రక్రియ పూర్తయిపోవడం గమనార్హం.

జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. ‘నో కాంప్రమైజ్’ అంటున్న టీవీకే!

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే పార్టీ ఏమాత్రం తగ్గేలా లేదు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడినందుకు ఉదయనిధి బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. టీవీకే జాతీయ అధికార ప్రతినిధి పళా సెల్వకుమార్ ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్‌కు (NCW) ఆధారాలతో సహా లేఖ రాసి, తీవ్ర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అటు బీజేపీ సైతం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శించింది. ఒకపక్క కావేరీ జలాల రచ్చ, మరోపక్క రాబోయే ఎన్నికల సమీకరణాల వేళ ఈ అరెస్ట్ వ్యవహారం తమిళనాడు రాజకీయాలను అత్యంత వేడెక్కించింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *