Elon Musk: అసాధ్యాలను సాధ్యం చేయడం ఎలన్ మస్క్‌కు వెన్నతో పెట్టిన విద్య! రాకెట్లను తిరిగి ల్యాండ్ చేయడం నుంచి మెదడుతో కంప్యూటర్లను నియంత్రించడం వరకు లోకాన్ని ఆశ్చర్యపరిచే ఎన్నో ప్రయోగాలను ఆయన నిజం చేసి చూపించారు. ఇప్పుడు వైద్యరంగంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి మస్క్‌కు చెందిన ‘న్యూరాలింక్’ (Neuralink) సంస్థ సిద్ధమైంది.
పుట్టుకతోనే పూర్తిగా కంటిచూపు లేని (100% అంధులైన) వారికి సైతం ఈ ప్రపంచాన్ని చూసే అద్భుత శక్తిని అందించే ‘విజన్ డివైజ్’ (Vision Device) పరికరాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నట్లు మస్క్ సంచలన ప్రకటన చేశారు.
కళ్లతో పనిలేదు.. నేరుగా మెదడుకే సిగ్నల్స్!
ఇప్పటివరకు పక్షవాతం వచ్చిన రోగులు తమ ఆలోచనల ద్వారా కంప్యూటర్లను, డిజిటల్ పరికరాలను ఆపరేట్ చేసేలా న్యూరాలింక్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ (BCI) ప్రయోగాలు చేసింది. అయితే, ఇప్పుడు ఒకడుగు ముందుకేసి నేరుగా మానవ స్పర్శ, జ్ఞానేంద్రియ వ్యవస్థలపై దృష్టి సారించింది.
ఈ సాంకేతికత పనితీరు గురించి ఎలన్ మస్క్ వివరిస్తూ:
రాబోయే 6 నుండి 12 నెలల్లో మేము మొదటి విజన్ డివైజ్‌ను మెదడులో అమర్చబోతున్నాం (Implant). మీరు పుట్టుకతోనే 100% అంధులైనా సరే.. మేము నేరుగా మీ మెదడులోని ‘విజువల్ కార్టెక్స్’ (Visual Cortex) విభాగానికి సిగ్నల్స్ పంపుతాం. దీనివల్ల మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు!
సాధారణంగా దెబ్బతిన్న కంటిపాపలు లేదా ఆప్టిక్ నరాలను పునర్నిర్మించడం కంటే, కళ్లతో సంబంధం లేకుండా బయటి ప్రపంచం నుంచి వచ్చే సమాచారాన్ని డివైజ్ ద్వారా నేరుగా మెదడు గ్రహించేలా డిజిటల్ సంకేతాలుగా మార్చడమే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం.
‘సూపర్ హ్యూమన్’ విజన్.. రియల్ లైఫ్ సూపర్‌హీరోలు!
ఈ ప్రయోగం కేవలం సాధారణ కంటిచూపును పునరుద్ధరించడానికే పరిమితం కాదని, భవిష్యత్తులో మానవ కంటి సామర్థ్యాన్ని మించిన శక్తిని అందిస్తుందని మస్క్ పేర్కొన్నారు.
-
అల్ట్రా HD రెజల్యూషన్: భవిష్యత్ వర్షన్లు మానవ కంటి కంటే చాలా పదునైన చూపును అందిస్తాయి.
-
ఇన్ఫ్రారెడ్ & రాడార్ విజన్: సాధారణ కంటికి కనిపించని ఇన్ఫ్రారెడ్, అతినీలలోహిత (Ultraviolet) కిరణాలను, రాడార్ సిగ్నల్స్‌ను కూడా మనుషులు చూడగలుగుతారు.
-
“దీర్ఘకాలంలో ఇది ఒక అద్భుతమైన సూపర్‌పవర్ లాంటిది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసేది ఇకపై నిజం కాబోతోంది. ఆ భవిష్యత్తే న్యూరాలింక్” అని మస్క్ వ్యాఖ్యానించారు.
సవాళ్లు – సైంటిస్టుల ఉత్కంఠ!
మానవ మెదడులో ఇంప్లాంట్లు అమర్చడం, చూపును పునరుద్ధరించడం నరాల సైన్స్ (Neuroscience) రంగంలో అత్యంత సంక్లిష్టమైన ప్రయోగంగా నిపుణులు పరిగణిస్తారు. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం (FDA) నుంచి ప్రాథమిక మానవ ప్రయోగాలకు అనుమతులు లభించినప్పటికీ.. దీని భద్రత, డేటా ప్రాసెసింగ్ మరియు మెదడు స్వీకరించే విధానంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఏది ఏమైనా, ప్రయోగం విజయవంతమైతే చీకటి ప్రపంచంలో మగ్గుతున్న కోట్లాది మంది అంధుల జీవితాల్లో వెలుగులు నిండడం ఖాయం!
