Tragedy: స్పెయిన్ ఫుట్‌బాల్ మైదానంలో ఊహించని ఘోర విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ ఆడుతుండగా ప్రత్యర్థి జట్టు గోల్కీపర్ను బలంగా ఢీకొన్న స్పానిష్ సెకండ్ డివిజన్ క్లబ్ సీడీ టెనెరిఫ్ (CD Tenerife) స్టార్ ఫుట్‌బాలర్ జీసస్ డి మిగెల్ (30) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు. ఈ విషాద వార్తతో ప్రపంచ ఫుట్‌బాల్ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మైదానంలో అసలేం జరిగింది?
స్పానిష్ లీగ్‌లో భాగంగా ఎస్టాడియో స్టేడియంలో సీడీ టెనెరిఫ్, ఎఫ్‌సీ ఆండోరా (FC Andorra) క్లబ్‌ల మధ్య సోమవారం రాత్రి ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ చివరి దశకు చేరిన సమయంలో ఇరు జట్ల స్కోరు 2-2తో సమంగా ఉంది. విజయం కోసం టెనెరిఫ్ ఫార్వర్డ్ జీసస్ డి మిగెల్ బంతిని ఛేజ్ చేస్తూ గోల్ పోస్ట్ దిశగా దూసుకొచ్చాడు.
అదే సమయంలో బంతిని క్లియర్ చేయడానికి ఆండోరా గోల్‌కీపర్, ఈక్వటోరియల్ గినియా ఇంటర్నేషనల్ ప్లేయర్ జీసస్ ఓనో (Jesus Owono) పెనాల్టీ ఏరియా వెలుపలికి పరుగెత్తుకుంటూ వచ్చాడు.ఈ క్రమంలో గోల్‌కీపర్ ఓనో మోకాలు మిగెల్ ఛాతీ భాగానికి అత్యంత బలంగా తగిలింది.ఆ తీవ్రమైన దెబ్బకు మిగెల్ మైదానంలోనే విలవిల్లాడుతూ కుప్పకూలిపోయాడు.
మైదానంలోనే గుండెపోటు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
ఢీకొన్న వెంటనే మిగెల్ కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్ (గుండెపోటు)కు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది పిచ్‌పైనే అత్యవసరంగా సీపీఆర్ (CPR) నిర్వహించారు. దాదాపు ఐదు నిమిషాల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత పల్స్ అందడంతో, అంబులెన్స్‌లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఉంచారు.
అయితే తలకు, ఛాతీకి తీవ్ర గాయం కావడంతో ఆయన న్యూరోలాజికల్ కండిషన్ మరింత దిగజారి మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనకు కారణమైన గోల్‌కీపర్ ఓనోకు మ్యాచ్ రిఫరీ రెడ్ కార్డ్ చూపించి మైదానం నుంచి బయటకు పంపగా, తీవ్ర ఉద్రిక్తత నడుమ ఆ మ్యాచ్‌ను అర్థాంతరంగా రద్దు చేశారు.
తీవ్ర దుఃఖంలో మునిగిపోయాం.. టెనెరిఫ్ క్లబ్ నివాళి
తమ ప్రియతమ క్రీడాకారుడి మరణాన్ని ధ్రువీకరిస్తూ సీడీ టెనెరిఫ్ క్లబ్ భావోద్వేగ ప్రకటన విడుదల చేసింది. తీవ్రమైన బాధతో గుండె పగిలిపోతోంది, గొంతు మూగబోయింది.. ఇది నిజమని మేము నమ్మలేకపోతున్నాం. ఈ బాధను మాటల్లో వర్ణించలేం. మిగెల్ కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం” అని క్లబ్ పేర్కొంది.
ఆండోరా క్లబ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మాజీ బార్సిలోనా డిఫెండర్, ఆండోరా క్లబ్ ప్రధాన వాటాదారు గెరార్డ్ పికే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా “జీసస్ డి మిగెల్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది” అని నివాళులర్పించారు.రియల్ మాడ్రిడ్, ఎఫ్‌సీ బార్సిలోనా, అట్లెటికో మాడ్రిడ్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌లు సంతాపం ప్రకటించాయి.
కోపా డెల్ రే మ్యాచ్‌లు వాయిదా
రాయల్ స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (RFEF) మిగెల్ మృతికి సంతాపం ప్రకటించింది. గౌరవసూచకంగా మంగళవారం జరగాల్సిన కోపా డెల్ రే (పురుషుల టోర్నీ), కోపా డెల్ రీనా (మహిళల టోర్నీ) మ్యాచ్‌లన్నింటినీ ఫెడరేషన్ వాయిదా వేసింది.
2015లో లెగానెస్తో యూత్ లెవల్లో సీనియర్ కెరీర్ ప్రారంభించిన మిగెల్, యూనియనిస్టాస్ డి సాలమాంకా, కాస్టెల్లన్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించి, 2025లో టెనెరిఫ్ క్లబ్లో చేరారు. అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న తరుణంలో మైదానంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆయన నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం క్రీడాలోకాన్ని శోకసంద్రంలో ముంచేసింది.
