ENE Repeat Trailer

ENE Repeat Trailer: తిరిగొచ్చిన గ్యాంగ్.. ఇంకా రచ్చ రచ్చే.. ENE Repeat ట్రైలర్‌ రిలీజ్‌

ENE Repeat Trailer: 2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా టాలీవుడ్‌లో ఎలాంటి కల్ట్ స్టేటస్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా వచ్చినప్పటి నుంచి హీరో విశ్వక్ సేన్, దర్శకుడు తరుణ్ భాస్కర్‌లకు ఎక్కడికి వెళ్లినా, ఏ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నా అభిమానుల నుంచి ఎదురయ్యే ఒకే ఒక్క ప్రశ్న.. “పార్ట్-2 ఎప్పుడు వస్తుంది?”. ఎట్టకేలకు ప్రేక్షకుల ఎదురుచూపులకు  తెరదించుతూ, మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ‘ENE Repeat’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూత్‌ఫుల్ వైబ్స్, న్యాచురల్  కామెడీతో అంచనాలను భారీగా పెంచేసింది.

కథేంటి? ట్రైలర్ ఎలా ఉంది?

తొలి భాగం ముగిసిన చోటు నుంచే ఈ సీక్వెల్ ప్రయాణం కానున్నట్లు తెలుస్తుంది. వివేక్ (విశ్వక్ సేన్) తన స్నేహితులతో కలిసి ఓ భారీ సర్వైవల్ సినిమాని తీయాలనుకుంటాడు. అయితే ఇందులో నటుడిగా ఉన్న కౌశిక్ డేట్స్ దక్కించుకోవడం, అతడిని ఒప్పించడం వివేక్‌కు పెద్ద సవాల్‌గా మారుతుంది.

స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు, ఈగో క్లాషెస్ వల్ల సమస్య మరింత జటిలమవుతుంది. ఆ విభేదాలను పక్కనబెట్టి సినిమాను పట్టాలెక్కించేందుకు మిత్రులంతా కలిసి మరోసారి సరదా ట్రిప్‌కు ప్లాన్ చేస్తారు.

ఈ ట్రిప్‌లో వారికి ఎదురయ్యే ఊహించని పరిస్థితులు, అనుకోని మలుపులు, హిలేరియస్ సంభాషణలు ట్రైలర్‌లో ఆద్యంతం నవ్వులు పూయిస్తున్నాయి. తరుణ్ భాస్కర్ తన మార్క్ పంచ్‌లు, గ్రౌండెడ్ క్యారెక్టరైజేషన్స్‌తో ట్రైలర్‌ను అత్యంత సహజంగా మలిచారు.

ఆకట్టుకుంటున్న నటీనటుల పెర్ఫార్మెన్స్..

విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి నలుగురూ క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్‌గా మరోసారి వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకప్పుడు కలిసి ఉండి, తర్వాత మనస్పర్థలతో విడిపోయిన స్నేహితుల మధ్య ఉండే భావోద్వేగాలను, ఈగోలను పర్ఫెక్ట్‌గా పండించారు.

తొలి భాగంలో మెరిసిన అనీషా ఆంబ్రోస్ ఇందులోనూ తన పాత్రలో అందంగా కనిపిస్తుండగా.. సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉన్న అమ్మాయిగా శివాత్మిక రాజశేఖర్ కనిపించనున్నారు. ఆమె తండ్రి ఈ గ్యాంగ్‌ను విడగొట్టేందుకు చేసే కుట్రలు కథకు మరింత ఆసక్తిని జోడిస్తున్నాయి.

వివేక్ సాగర్ సంగీతం.. బిగ్గెస్ట్ హైలైట్!

ఈ ట్రైలర్‌కు ప్రాణం పోసింది మాత్రం సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.తన విలక్షణమైన బీజీఎమ్‌తో ప్రతి సీన్‌ను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లారు. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ఫ్రెష్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. డైలాగులు, ప్రొడక్షన్ వాల్యూస్, పాత్రల మధ్య సాగే రియలిస్టిక్ డ్రామా ప్రేక్షకులను మొదటి సినిమా నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తున్నాయి.

నవంబర్ 19న గ్రాండ్ రిలీజ్

ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ నవంబర్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ నగరానికి ఏమైంది గ్యాంగ్ మరోసారి బిగ్ స్క్రీన్‌పై రచ్చ చేయడానికి సిద్ధమవడంతో సినీ ప్రియుల్లో భారీ హైప్ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *