Rahul Gandhi: దేశవ్యాప్తంగా లబోదిబోమంటున్న విద్యార్థుల వేదనను, రోడ్లపైకి వచ్చి వారు చేసిన శాంతియుత నిరసనలను లోక్‌సభ వేదికగా బలపరుస్తూ మాట్లాడారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బుధవారం లోక్‌సభలో ‘యాంటీ పేపర్ లీక్ (సవరణ) బిల్లు’పై జరిగిన సుదీర్ఘ చర్చలో పాల్గొన్న ఆయన, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
“అది హింస కాదు.. మన భవిష్యత్తు సముద్రంలా ఎగసిపడ్డ తీరు!”
“ఢిల్లీ వీధుల్లోనో లేదా దేశంలోని వేరే ప్రాంతాల్లోనో విద్యార్థులు చేసింది హింసాత్మక నిరసన కాదు. అది మన దేశానికి కాబోయే భవిష్యత్తును వ్యక్తపరచడానికి చేసిన లోతైన భావ వ్యక్తీకరణ” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నీట్ (NEET-UG 2026) వంటి పరీక్షల్లో అక్రమాలు, వరుస పేపర్ లీక్‌లతో రాత్రింబవళ్లు చదివిన విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారని, వారి ఆగ్రహాన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు:
“ఈ నిరసనల గురించి మీ పిల్లల అభిప్రాయం ఏంటో ఒకసారి ఇంటికి వెళ్లి అడిగి చూడండి! వారి అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు అనుభవిస్తున్న ఈ నరక యాతనను చూసి మీ పిల్లలు కూడా విద్యార్థుల పక్షానే నిలబడతారు. వారు చేసిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు.. మన దేశ యూత్ ధైర్యాన్ని చూసి ప్రతి భారతీయుడూ గర్వపడాలి” అని అన్నారు.
చదువుల వ్యవస్థ ఆత్మను ఆర్ఎస్ఎస్ బంధించింది!
కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల మొరను వినకుండా మూర్ఖంగా ప్రవర్తించిందని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పిల్లలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడేలా రెచ్చగొట్టిందని రాహుల్ మండిపడ్డారు.
దేశంలో విద్యారంగాన్ని క్రూరమైన వ్యాపారంగా మార్చేశారని ధ్వజమెత్తారు. “ఇవాళ మన విద్యా వ్యవస్థ ఆత్మను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన గుప్పిట్లోకి తీసుకుంది. విద్యార్థులు తమకు నచ్చిన ప్రశ్నలను అడిగే స్వేచ్ఛను కూడా కోల్పోతున్నారు” అని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌లో పెరిగిన ఉద్రిక్తత
రాహుల్ గాంధీ తన ప్రసంగంలో వాడిన కొన్ని పదాలపై అధికార పక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో లోక్‌సభలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజులు జోక్యం చేసుకుంటూ.. నిబంధనలకు విరుద్ధమైన పదాలను ఉపసంహరించుకోవాలని, కేవలం పేపర్ లీక్ బిల్లుపై మాత్రమే మాట్లాడాలని కోరారు.
మొత్తానికి నీట్ పరీక్షలో అక్రమాలు, విద్యార్థుల ఆందోళనల వేడి పార్లమెంట్‌ను తీవ్రంగా దహించివేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.
