MEA Data: ఉపాధి కోసం, కుటుంబాలను పోషించుకోవడం కోసం దేశాలు దాటి వెళ్తున్న భారతీయ కార్మికుల జీవితాలు విదేశాల్లోనే ముగిసిపోతున్నాయి. 2023 నుంచి 2025 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 39,000 మందికి పైగా భారతీయులు వివిధ కారణాలతో మరణించారని కేంద్ర విదేశాంగ శాఖ పార్లమెంట్లో వెల్లడించింది.
కాంగ్రెస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ షాకింగ్ వివరాలను లిఖితపూర్వకంగా అందించారు.
1. గల్ఫ్ దేశాల్లోనే 70% ఆత్మహత్యలు
గడిచిన మూడేళ్లలో విదేశాల్లో మొత్తం 1,900 మందికి పైగా భారతీయులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 70 శాతం కంటే ఎక్కువ (1,340 మంది) ఒక్క గల్ఫ్ దేశాల్లోనే సంభవించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
-
యూఏఈ (UAE): అత్యధికంగా 511 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
-
సౌదీ అరేబియా: 354 మంది
-
కువైట్: 162 మంది
-
ఒమన్: 146 మంది
-
ఇతర దేశాలు: మలేషియాలో 131, అమెరికాలో 62, కెనడా, యూకే, ఇటలీలలో చెరో 30 మంది చొప్పున బలవన్మరణానికి పాల్పడ్డారు.
2. పని ప్రదేశాల్లో ప్రమాదాలు: వారానికి ముగ్గురు మృతి
విదేశాల్లో పని చేసే చోట జరిగిన ప్రమాదాల వల్ల మూడేళ్లలో 800 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో సగానికి పైగా ప్రమాదాలు గల్ఫ్ దేశాల్లోనే జరిగాయి. సగటున గల్ఫ్‌లో ప్రతి వారం ముగ్గురు భారతీయ కార్మికులు పని ప్రదేశాల్లో జరిగే ప్రమాదాలకు బలవుతున్నారు. పని ప్రదేశాల ప్రమాద మరణాల్లో సౌదీ అరేబియా (182) మొదటి స్థానంలో ఉండగా, యూఏఈ (128) రెండో స్థానంలో ఉంది.
3. కేంద్రం తీసుకుంటున్న చర్యలు
గతంతో పోలిస్తే విదేశాల్లో భారతీయుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రవాస కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
ప్రవాసీ భారతీయ బీమా యోజన: ‘ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్’ (ECR) కేటగిరీ కింద వెళ్లే కార్మికులకు రూ. 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు.
