NPPA

NPPA: షుగర్, బిపి, గుండె జబ్బుల మందుల ధరలు తగ్గించిన కేంద్రం.. 39 కీలక ఔషధాల కొత్త ధరల లిస్ట్ ఇదే!

NPPA: దేశంలో సామాన్య ప్రజలకు వైద్య సేవలు, మందులను తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే 39 రకాల ముఖ్యమైన మందుల గరిష్ట చిల్లర ధరలను (Retail Prices) ‘నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ’ (NPPA) అధికారికంగా ఖరారు చేసింది. ఈ కొత్త నిర్ణయం వల్ల రక్తపోటు (బిపి), మధుమేహం (షుగర్), గుండె జబ్బులు, రకరకాల ఇన్‌ఫెక్షన్లు, కంటి సమస్యలు మరియు విటమిన్ లోపాలకు వాడే పలు రకాల మందులు ఇకపై సామాన్యులకు భారంగా మారకుండా, ప్రభుత్వం నిర్ణయించిన చౌక ధరలకే లభించనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించిన ఈ 39 మందుల జాబితాలో ప్రతిరోజూ లక్షలాది మంది వాడే కీలక ఔషధాల ఫార్ములేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన మందుల కొత్త ధరల వివరాలు (ఒక్కో టాబ్లెట్/క్యాప్సూల్/సొల్యూషన్ ధర రూపాయల్లో) ఈ క్రింది విధంగా ఉన్నాయి:

సంఖ్య ఔషధం పేరు (సాల్ట్ కాంబినేషన్) కొత్త చిల్లర ధర (రూపాయల్లో)
1 అమ్లోడిపైన్, టెల్మిసార్టన్, మెటోప్రోలోల్ సక్సినేట్ (బిపి కోసం) 12.03
2 అమోక్సిసిలిన్, క్లావులనేట్ పొటాషియం (యాంటీబయాటిక్) 27.31
3 ఆస్పిరిన్, అటోర్వాస్టాటిన్, క్లోపిడోగ్రెల్ (గుండె, కొలెస్ట్రాల్ కోసం) 8.86
4 డాపగ్లిఫ్లోజిన్, టెల్మిసార్టన్ (షుగర్, బిపి కోసం) 19.30
5 ఎంపాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ (షుగర్ కోసం) 14.88
6 గ్లిమెపిరైడ్, వోగ్లిబోస్, మెట్‌ఫార్మిన్ (షుగర్ కోసం) 8.85
7 విటమిన్ డి ఓరల్ సొల్యూషన్ (లిక్విడ్) 15.88
8 సెటిరిజైన్ హైడ్రోక్లోరైడ్ డ్రాప్స్ (అలర్జీ కోసం) 8.55

(నోట్: ఇవే కాకుండా గుండెపోటు సమయంలో అత్యవసరంగా ఇచ్చే ‘టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్’ ధరను గరిష్టంగా రూ. 60,238.27 గా, క్యాన్సర్ వంటి చికిత్సల్లో వాడే ‘ఇమాటినివ్ ఓరల్ సొల్యూషన్’ ధరను రూ. 59.61 గా ప్రభుత్వం ఫిక్స్ చేసింది.)

కంపెనీలకు కేంద్రం కఠిన హెచ్చరికలు:

మార్కెట్లో మందులు అమ్మే ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా ప్రభుత్వం ఖరారు చేసిన ఈ ధరల కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఏ కంపెనీ అయినా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరకు అమ్మితే.. ‘నిత్యావసర వస్తువుల చట్టం-1955’ ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసిన అదనపు సొమ్మును వడ్డీతో సహా ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సి ఉంటుంది.

అలాగే మెడికల్ షాపుల యజమానులు, పంపిణీదారులు అందరూ ఈ కొత్త ధరల పట్టికను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా తమ దుకాణాల్లో ప్రదర్శించాలని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ మందులను కొత్త బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి తెచ్చే కంపెరీలు సైతం ఈ ప్రభుత్వ ధరలనే పాటించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్ల మంది రోగులకు నెలకు అయ్యే మందుల ఖర్చు గణనీయంగా తగ్గనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *