Tamil Nadu Politics

Tamil Nadu Politics: తమిళనాట ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి విజయభాస్కర్ రాజీనామా..!

Tamil Nadu Politics:  తమిళనాడు రాజకీయాల్లో ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి కొనసాగుతున్న ఎమ్మెల్యేల రాజీనామాల పర్వంలో మరో కీలక వికెట్ పడింది. ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ రవాణా శాఖ మంత్రి, కరూర్ ఎమ్మెల్యే ఎం.ఆర్. విజయభాస్కర్ సోమవారం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఉదయం చెన్నైలోని రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్‌ను వ్యక్తిగతంగా కలిసిన విజయభాస్కర్.. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నిబంధనలను పరిశీలించిన అనంతరం స్పీకర్ ఈ రాజీనామాను తక్షణమే ఆమోదించారు.

ఎడప్పాడి పళనిస్వామికి తప్పని తిప్పలు.. 41కి పడిపోయిన బలం!

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు.

అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం (Confidence Motion) సమయంలో ఏఐఏడీఎంకేకు చెందిన సుమారు 25 మంది ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి మరీ టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

తిరుగుబాటు చేసిన వారిలో ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికార టీవీకే గూటికి చేరగా.. తాజాగా విజయభాస్కర్ ఆరో ఎమ్మెల్యేగా ఆ బాటలోనే నడిచారు. దీంతో తమిళనాడు అసెంబ్లీలో ఏఐఏడీఎంకే పార్టీ బలం కేవలం 41 స్థానాలకు పడిపోయింది. విజయభాస్కర్ కూడా ఈరోజే అధికారికంగా టీవీకే (తమిళగ వెట్రి కజగం) పార్టీలో చేరబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.

ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు!

దివంగత ముఖ్యమంత్రి జయలలిత కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన ఎం.ఆర్. విజయభాస్కర్‌కు కరూర్ జిల్లాలో మంచి పట్టుంది. 2021 ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ, ఈ ఏడాది (2026) జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కరూర్ నుండి తిరిగి ఘన విజయం సాధించారు.

తాజాగా విజయభాస్కర్ రాజీనామాతో కలిపి తమిళనాడులో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల సంఖ్య ఏడుకు (7) చేరింది. ఇందులో ముఖ్యమంత్రి విజయ్ వదులుకున్న తిరుచ్చి నియోజకవర్గం కూడా ఒకటి ఉంది. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ ఏడు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు (By-elections) నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *