Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో జరగాల్సిన ప్రతిష్టాత్మక ‘రైతు భరోసా’ బహిరంగ సభను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, మధిర సభ రద్దవ్వడంతో తమకు అందాల్సిన రైతు భరోసా నిధులు ఆలస్యమవుతాయేమోనని అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం ఉండబోదని, కేవలం సభా వేదికను మాత్రమే హైదరాబాద్‌కు మారుస్తున్నట్లు స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.
రేపు శిల్పకళా వేదికలో ‘రైతు భరోసా’ సభ
మొదట మధిరలో రైతుల సమక్షంలో అట్టహాసంగా నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. కానీ, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని ఇండోర్ వేదికను ఎంపిక చేశారు.
దీని ప్రకారం, రేపు (జూన్ 30) సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ రైతు భరోసా కార్యక్రమం అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులను జమ చేయనున్నారు.
నిధుల జమలో మార్పు లేదు: అధికారుల స్పష్టత
సభా వేదిక మారినప్పటికీ, ముందుగా అనుకున్న టైమ్‌లైన్ ప్రకారమే నిధులు విడుదలవుతాయని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా సాంకేతిక పరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. వాతావరణ సవాళ్లు ఎదురైనప్పటికీ, అన్నదాతలకు ఇచ్చిన మాట ప్రకారం జూన్ 30 నాడే నిధులు అందిస్తామని ప్రభుత్వ వర్గాలు రీఅస్యూరెన్స్ ఇచ్చాయి.
