Priest

Priest: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్నారై పూజారి అరెస్ట్

Priest: భూతవైద్యం, ప్రత్యేక పూజల పేరుతో అమాయకులను నమ్మించి లక్షల రూపాయల గుంజిన ఒక ఎన్నారై (NRI) కేటుగాడు ఎట్టకేలకు చట్టానికి దొరికాడు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన నిందితుడిని ఇమిగ్రేషన్ అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని చామర్తి రామ లచ్చారావుగా నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు. దోష నివారణ పూజలు చేస్తానంటూ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి ఏకంగా రూ.20 లక్షలు కాజేయడమే కాకుండా, ఎదురు తిరిగితే చేతబడి చేసి సర్వనాశనం చేస్తానంటూ సదరు బాధితుడిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఇతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గతంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, అప్పట్లోనే నిందితుడు గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు పారిపోవడంతో అతడిని పట్టుకునేందుకు లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ లచ్చారావు కేవలం భారత్‌లోనే కాకుండా అమెరికాలోనూ ఇవే తరహా మోసాలకు పాల్పడినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ కూడా పూజల పేరుతో దగా చేయడమే కాకుండా, తను నిర్వహిస్తున్న ఆలయానికి సంబంధించిన నిధుల వివాదాలు, లీగల్ కేసుల ముప్పు పొంచి ఉండటంతో.. అక్కడి పోలీసులకు దొరకకూడదనే భయంతో ఇండియాకు పారివచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

నిందితుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే ఎల్ఓసీ అలర్ట్ ఆధారంగా ఇమిగ్రేషన్ విభాగం అతడిని గుర్తించి నిలవరించింది. ప్రస్తుత దర్యాప్తులో ఇతని చేతిలో మోసపోయిన బాధితులు మరికొందరు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామ లచ్చారావు నెరిపిన అంతర్జాతీయ మోసాల నెట్‌వర్క్‌పై పోలీసులు అన్ని కోణాల్లో నిఘా పెట్టారు. పరిహారాలు, చేతబడులు మాయం చేస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బులు డిమాండ్ చేసే దొంగ బాబాలను, పూజారులను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని, ఇలాంటి అనుమానాస్పద వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ రక్షణ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *