DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, తన తదుపరి వారసుడిగా డీకే శివకుమార్ పేరును స్వయంగా ప్రతిపాదించడం విశేషం.
గురువారం ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన నివాసంలో రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రత్యేకంగా బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాతో మాట్లాడారు. సిద్ధరామయ్య మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేస్తారని, కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిద్ధరామయ్యే స్వయంగా డీకే పేరును ముందుకు తెచ్చినట్లు మంత్రి వెల్లడించారు.
గవర్నర్‌కు రాజీనామా లేఖ
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయాన్ని సీఎం కార్యాలయం (CMO) కూడా అధికారికంగా ధృవీకరించింది. ఆయన మధ్యాహ్నం 2:30 గంటలకు లోక్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం సిద్ధరామయ్య తన నివాసంలో మీడియాతో మాట్లాడి, రాష్ట్రంలో జరిగిన ఈ నాయకత్వ మార్పునకు గల కారణాలను వివరించనున్నారు.
శనివారం ప్రమాణస్వీకారం!
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈ శనివారమే ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్‌లో సాగుతున్న అంతర్గత చర్చలకు, నాయకత్వ మార్పు ఊహాగానాలకు సిద్ధరామయ్య నిర్ణయంతో తెరపడినట్లయింది. డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టనుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
