Ram Mandir CEO Vacancy: అయోధ్యలోని ప్రసిద్ధ రామ మందిర నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చూసుకోవడం కోసం ‘శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి (CEO) పదవికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి జూలై 18, 2026 సాయంత్రం 4 గంటల వరకు ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు ట్రస్ట్ అధికారిక ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు ఏంటి..?
ఈ అత్యున్నత పదవికి దరఖాస్తు చేసుకునే వారి కోసం ట్రస్ట్ కొన్ని కఠినమైన నిబంధనలను పెట్టింది..
-
వయస్సు & విద్య: అభ్యర్థుల వయస్సు 50 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
-
అనుభవం: ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో కనీసం 20 ఏళ్ల పాటు ఉన్నత పరిపాలనా (మేనేజర్/అడ్మినిస్ట్రేషన్) అనుభవం ఉండాలి. రిటైర్డ్ సీనియర్ అధికారులకు కూడా అవకాశం ఉంది.
-
భాష & సంప్రదాయం: హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉండాలి. అభ్యర్థి ఖచ్చితంగా సనాతన హిందూ సంప్రదాయాన్ని పాటించేవారై ఉండాలి. ముఖ్యంగా ‘శ్రీరామావత్ వైష్ణవ’ సంప్రదాయానికి చెందిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
సీఈఓ చేయాల్సిన పనులు (బాధ్యతలు)
ఎంపికైన సీఈఓను మొదట మూడేళ్ల కాలపరిమితికి నియమిస్తారు. ఆయన అయోధ్యలోనే ఉంటూ ఈ కింది కీలక బాధ్యతలను చూసుకోవాలి..
-
ప్రతిరోజూ ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తుల దర్శన ఏర్పాట్లు, వారికి కావలసిన వసతులను పర్యవేక్షించాలి.
-
ఆలయ భద్రతను చూస్తూ.. లోకల్, స్టేట్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి.
-
ట్రస్ట్‌కు వచ్చే కోట్లాది రూపాయల విరాళాలు, కానుకల లెక్కలను పారదర్శకంగా ఉంచాలి. ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేయించాలి.
-
మందిర ప్రాంగణంలో జరిగే మిగతా అభివృద్ధి పనులను, పూజలు, ఉత్సవాలను దగ్గరుండి నడిపించాలి.
జీతం మరియు సదుపాయాలు
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులతో సమానంగా భారీ వేతన ప్యాకేజీని అందిస్తారు. జీతంతో పాటు అయోధ్యలోనే సకల సౌకర్యాలతో కూడిన అధికారిక నివాసం (ఇల్లు), సొంత వాహనం, డ్రైవర్, సెక్యూరిటీ సిబ్బంది, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి అన్ని రకాల రాయితీలను ట్రస్ట్ తన సొంత నిధుల నుంచే భరిస్తుంది.
ఎంపిక కోసం ప్రత్యేక కమిటీ
ఈ సెలక్షన్ ప్రాసెస్ చాలా పారదర్శకంగా జరగడం కోసం ట్రస్ట్ ఒక ప్రత్యేక ‘అన్వేషణ కమిటీ’ని (Search Committee) ఏర్పాటు చేసింది. ఇందులో రిటైర్డ్ జడ్జి ప్రదీప్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, సురేష్ హవాడే సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, సరైన ముగ్గురి పేర్లను తుది ఎంపిక కోసం ట్రస్ట్‌కు సిఫారసు చేస్తుంది.
ఇటీవల రామ మందిర కానుకల లెక్కింపులో కొన్ని అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడం, దానిపై సిట్ (SIT) విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. ఆలయ పరిపాలనను పూర్తిగా ప్రక్షాళన చేయడానికే ట్రస్ట్ ఈ సీఈఓ పోస్టును భర్తీ చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు.
