Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో చక్రం తిప్పిన అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి వరుసగా గట్టి దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయగా, ఇప్పుడు మరో ముఖ్య నేత కూడా అదే బాట పట్టారు. పార్టీలోని కీలక నేతలైన సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గానికి చెందిన రెబల్ ఎమ్మెల్యే ఈశాకి సుబయ్య తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో అన్నాడీఎంకే పార్టీ మరింత బలహీనపడినట్లయింది.
ఈశాకి సుబయ్య మంగళవారం అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. ఆయన రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తప్పుకోవడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నలుగురు నేతలు రాజీనామా చేసిన వెంటనే రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీలో చేరిపోవడం గమనార్హం. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో వీరంతా టీవీకే పార్టీ తరఫునే మళ్లీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈశాకి సుబయ్య ఇటీవలే జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అంబసముద్రం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విపీ దురైపై 10 వేలకు పైగా ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన టీవీకే పార్టీకి కూడా అక్కడ మంచి ఓట్లే వచ్చాయి. అయితే, ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే అన్నాడీఎంకే పార్టీ రెండు ముక్కలైంది. షణ్ముగం, వేలుమణి నేతృత్వంలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, వారిలో ఈశాకి సుబయ్య కూడా ఉన్నారు.
ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం మొదటి నుంచి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. మే 13న అసెంబ్లీలో జరిగిన ముఖ్యమైన బలపరీక్షలో కూడా ఈ రెబల్ ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికే మద్దతుగా ఓటు వేశారు. ఇప్పుడు ఏకంగా తమ పదవులకు రాజీనామా చేసి అధికారికంగా టీవీకే కండువా కప్పుకోవడంతో, అన్నాడీఎంకే పార్టీని కోలుకోలేని దెబ్బ తీశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
