Gold Price Today: గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ఎప్పుడూ లేనంతగా ఆకాశాన్ని తాకుతున్న పసిడి రేట్లు మంగళవారం నాడు ఉన్నట్లుండి పడిపోవడంతో కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది. సోమవారం కూడా ధరలు పెరిగినప్పటికీ, ఇవాళ మార్కెట్‌లో మార్పు కనిపించింది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ తగ్గింపు బంగారం ప్రియులకు ఒక తీపి కబురనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 490 తగ్గి.. ప్రస్తుతం రూ. 1,58,890 వద్ద కొనసాగుతోంది. అలాగే, సాధారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 450 మేర పడిపోయి రూ. 1,45,650 వద్దకు చేరింది.
దేశంలోని మిగతా ప్రధాన నగరాల్లో చూసుకుంటే.. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,61,250 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,47,810 వద్ద ట్రేడవుతోంది. ఐటీ హబ్ బెంగళూరులో హైదరాబాద్ తరహాలోనే 24 క్యారెట్ల ధర రూ. 1,58,890, మరియు 22 క్యారెట్ల ధర రూ. 1,45,650 గా నమోదయ్యాయి. ఇక్కడ కూడా నిన్నటి కంటే దాదాపు రూ. 450 మేర ధర తగ్గడం విశేషం.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. అక్కడ 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,59,040 వద్ద, అలాగే 22 క్యారెట్ల ధర రూ. 1,45,800 వద్ద కొనసాగుతున్నాయి. నిన్నటి కంటే ఇక్కడ రూ. 490 మేర ధర తగ్గింది. బంగారంతో పాటు వెండి కూడా ఇవాళ భారీగానే దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 2.85 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ధరలు స్వల్పంగా తగ్గడంతో మార్కెట్లలో కొనుగోళ్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
