Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ స్టార్ హీరో, ముఖ్యమంత్రి దళపతి విజయ్ తన పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్‌తో సంచలనం సృష్టించారు. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి కోలుకోలేని పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్‌కు తమ రాజీనామా లేఖలు సమర్పించిన వెంటనే, వారు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. రాబోయే ఉపఎన్నికల్లో వీరు టీవీకే పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలు ముగిసినా తమిళనాడులో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవలే అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష సమయంలోనే ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఇప్పుడు అధికారికంగా టీవీకే కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమరవేల్ నేతృత్వంలో.. పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్, ధారాపురం ఎమ్మెల్యే సత్యభామలు చెన్నై సచివాలయంలో స్పీకర్ జె.సి.పి. ప్రభాకరన్‌ను కలిసి తమ రాజీనామా లేఖలను అందించారు.
ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వెంటనే ఈ ముగ్గురు నేతలు విజయ్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఆధవ్ అర్జునను నేరుగా కలిశారు. ఆ నేతలకు మంత్రి శాలువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. త్వరలోనే వీరు ముఖ్యమంత్రి విజయ్‌ను కూడా కలవనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యభామ మాట్లాడుతూ.. ‘‘తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే, తాము దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారి సుపరిపాలనను చూస్తున్నాం’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై మంత్రి ఆధవ్ అర్జున స్పందిస్తూ.. సీఎం విజయ్‌ను నమ్మి వచ్చిన వారికి పార్టీలో పూర్తి ప్రాధాన్యత ఉంటుందని, అంతా ఒకే కుటుంబంగా ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ అంతర్గత విభేదాలతో, రెండు వర్గాలుగా విడిపోయి తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం వర్గం.. ఎడప్పాడి పళనిస్వామితో తిరిగి చేతులు కలపడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో ముగ్గురు కీలక ఎమ్మెల్యేలు పార్టీని వీడటం అన్నాడీఎంకేకు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ఈ ముగ్గురి రాజీనామాతో అసెంబ్లీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల బలం 44కు పడిపోయింది. మొన్నటి బలపరీక్షలో విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చిన వీరు.. ఇప్పుడు నేరుగా టీవీకే గూటికి చేరడంతో సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం మరింత పటిష్టంగా మారింది.
తమిళనాడులో అన్నాడీఎంకే సాంప్రదాయ ఓటు బ్యాంకుకు ప్రత్యామ్నాయంగా దూసుకొచ్చిన దళపతి విజయ్.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నుండి వికెట్లను పడగొట్టడం ప్రారంభించారు. జయలలిత పాలనను విజయ్ ప్రభుత్వంలో చూస్తున్నామంటూ అన్నాడీఎంకే సీనియర్ నేతలే వ్యాఖ్యానించడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే నుండి మరికొంత మంది ముఖ్య నేతలు టీవీకే వైపు చూసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
