ACB Raids: హైదరాబాద్‌లో అవినీతి అధికారుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ అవినీతి నిరోధక శాఖ మరో భారీ తిమింగలాన్ని పట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో జలమండలి ఉన్నతాధికారి నివాసాలపై ఏసీబీ అధికారులు జరిపిన మెరుపు దాడులు నగరంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సోదాల్లో కళ్లు బైర్లు గమ్మేలా భారీగా నగదు, విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు బయటపడ్డాయి.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ రెడ్ హిల్స్ ప్రాజెక్ట్ డివిజన్-8 లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఎస్. అనంత లక్ష్మి కుమార్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఆయన తన అధికారిక పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో అధికారులు ఏకకాలంలో తనిఖీలు మొదలుపెట్టారు.
హైదరాబాద్‌లోని మల్లాపూర్, వెంకటరమణ కాలనీలో ఉన్న కుమార్ స్వంత ఇల్లే కాకుండా, ఆయన బంధువులు, అత్యంత సన్నిహితులకు చెందిన మొత్తం 8 ప్రాంతాలలో ఈ సోదాలు కొనసాగాయి. తనిఖీల సమయంలో కుమార్ ఇంట్లో లభించిన డబ్బును చూసి అధికారులే నోరెళ్లబెట్టారు. కేవలం ఆయన నివాసంలోనే సుమారు 1 కోటి రూపాయల నగదు దొరికినట్లు తెలుస్తోంది. బీరువాల్లో కుప్పలు తెప్పలుగా ఉన్న నోట్ల కట్టలను లెక్కపెట్టడానికి అధికారులు ప్రత్యేకంగా కౌంటింగ్ మెషీన్లను తెప్పించారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
నగదుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములు, ఓపెన్ ప్లాట్లు, భారీగా బంగారు ఆభరణాలకు సంబంధించిన కీలకమైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బంధువుల ఇళ్లలో దొరికే ఆస్తుల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఈ అక్రమ ఆస్తుల విలువ మరిన్ని కోట్లకు చేరే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి. విచారణ పూర్తిగా ముగిసిన తర్వాత స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకుని అక్రమ మార్గాల్లో కోట్లు గడించిన ఈ అధికారి బాగోతం ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
