MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఎదురుదెబ్బ తగలడంతో, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఓటమి తర్వాత, ఆయన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు స్టాలిన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో స్టాలిన్ తాను పోటీ చేసిన కొళత్తూర్ నియోజకవర్గం నుంచి ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మరోవైపు, ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మొత్తం 234 స్థానాలకు గానూ 107 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికారంలో ఉన్న డీఎంకే కూటమి కేవలం 74 స్థానాలకే పరిమితమైంది. రెండు చోట్ల పోటీ చేసిన విజయ్ రెండింటిలోనూ ఘన విజయం సాధించి రాజకీయాల్లో తన సత్తా చాటారు.
ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు మొదలయ్యాయి. అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే చీఫ్ విజయ్ ఇప్పటికే గవర్నర్‌కు ఈమెయిల్ ద్వారా లేఖ రాశారు. తమకు 108 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. త్వరలోనే గవర్నర్‌ను నేరుగా కలిసి మెజారిటీ నిరూపించుకుంటామని, అందుకు కొంత సమయం కావాలని కూడా విజయ్ తన లేఖలో విన్నవించినట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడులో ‘విజయ్’ యుగం మొదలుకాబోతోందని ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
