Weather Report

Rain Alert: ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు.. భానుడి భగభగలు, వరుణుడి వింత చేష్టలు!

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఎప్పుడెలా మారుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వచ్చే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఏపీలో పిడుగుల హెచ్చరిక – ఈ జిల్లాల వారు జాగ్రత్త!
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురియవచ్చు. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు చెట్ల కింద లేదా కరెంటు స్తంభాల వద్ద ఉండకూడదని అధికారులు సూచించారు.

తెలంగాణలోనూ వర్ష సూచన
తెలంగాణపై కూడా వాతావరణ శాఖ ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం వేళల్లో అకస్మాత్తుగా గాలివాన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

అకాల వర్షంతో కన్నీరు పెడుతున్న అన్నదాత
ఈ అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా దేవరపల్లి మండలంలో ఆరబెట్టిన మొక్కజొన్న, ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట కళ్లముందే పాడైపోవడంతో, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

మండిపోతున్న ఎండలు – 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు
ఒకవైపు వర్షాలు భయపెడుతుంటే, మరోవైపు ఎండలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటుతుండగా, మధ్యాహ్నం సమయానికి 40 డిగ్రీలు క్రాస్ అవుతున్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *