Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, అడవి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నేడు (బుధవారం, జనవరి 28) అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. నేటి నుంచి జనవరి 31 వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు 3 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
నేటి విశేషాలు:
జాతర మొదటి రోజైన బుధవారం సాయంత్రం మేడారంలో ఆధ్యాత్మిక కోలాహలం మొదలవుతుంది. కన్నెపల్లి గ్రామం నుంచి పూజారులు సారలమ్మ తల్లిని గద్దెపైకి తీసుకువస్తారు. అదే సమయంలో కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారంలోని గద్దెలపైకి చేర్చడంతో జాతర అధికారికంగా మొదలవుతుంది. రేపు (గురువారం) సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో జాతర ప్రధాన ఘట్టం ఆరంభమవుతుంది.
ఇది కూడా చదవండి: Loyal Dog: యజమాని చనిపోయినా వదలని బంధం.. మంచుకొండల్లో మూడు రోజులు కాపలా కాసిన మూగజీవి!
జనసంద్రమైన మేడారం:
జాతర నేడు ప్రారంభమైనప్పటికీ, గత వారం రోజులుగానే మేడారం జనంతో నిండిపోయింది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో మేడారం దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. బుధవారం ఉదయమే సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.
ప్రభుత్వ ఏర్పాట్లు: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది:
- సిబ్బంది: 21 శాఖలకు చెందిన 42 వేల మందికి పైగా సిబ్బంది విధుల్లో ఉన్నారు.
- రవాణా: టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) భక్తుల కోసం 4,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
- పార్కింగ్: వాహనాల కోసం 1,418 ఎకరాల్లో 42 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు.
- పర్యవేక్షణ: జాతర ప్రాంతాన్ని 8 జోన్లుగా, 42 సెక్టార్లుగా విభజించి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
జనవరి 30, 31 తేదీల్లో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లకు ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించనున్నారు. జనవరి 31వ తేదీ సాయంత్రం దేవతలందరూ తిరిగి వన ప్రవేశం చేయడంతో ఈ మహా జాతర ముగుస్తుంది.
