Amaravati : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. రాయపూడి సమీపంలో సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మైదానంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. జెండా ఎగురవేసిన అనంతరం, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ వంటి మొత్తం 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన 22 శకటాల ప్రదర్శన వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, “స్వర్ణాంధ్ర-2047” లక్ష్యంతో ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను అమలు చేస్తోందని వెల్లడించారు. పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేస్తూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 4 వేల రూపాయలకు పెంచామని, ప్రస్తుతం 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఈ సహాయం అందుతోందని ఆయన పేర్కొన్నారు. మహిళా సంక్షేమం కోసం ‘దీపం’ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
Also Read: 77th Republic Day: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనపై స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, విశాఖపట్నంను కీలకమైన ఎకనామిక్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అలాగే అమరావతిలో ‘క్వాంటమ్ వ్యాలీ’ని ప్రారంభించనున్నామని, ఏఐ (AI) టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. సాగునీటి రంగంలో పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, రైతులకు ‘పొలం పిలుస్తోంది’ వంటి కార్యక్రమాల ద్వారా నేరుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం త్వరలోనే పట్టాలెక్కించనుందని ఆయన ప్రకటించారు.
