Kavita: బీఆర్ఎస్ సభను బహిష్కరించడం సరైంది కాదు

Kavita: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీశ్ రావుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన నిర్ణయాన్ని తప్పుబట్టారు. వ్యక్తిగతంగా ఒక్క మాట అన్నందుకే మొత్తం సభను బహిష్కరించడం సరైంది కాదని, ఆ అంశంపై వాకౌట్ చేసి తిరిగి సభకు రావచ్చునని వ్యాఖ్యానించారు.

హరీశ్ రావు పార్టీ లోపలే ఒక ప్రత్యేక గ్రూపును తయారు చేస్తున్నారని కవిత ఆరోపించారు. బయట సభలు పెడుతూ చట్టసభల్లో మాట్లాడే అవకాశాన్ని వదులుకోవడం బీఆర్ఎస్‌కు నష్టమని అన్నారు. పార్టీ ప్రయోజనాలకన్నా వ్యక్తిగత రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న భావన కలుగుతోందని ఆమె వ్యాఖ్యలు చేశారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా హరీశ్ రావుపై కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ధనదాహం కోసమే జూరాల ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చారని, ఆ నిర్ణయాల వల్ల తెలంగాణకు చెందిన అనేక సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. ఈ మార్పులు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.

ఇదే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపైనా కవిత విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. గత ప్రభుత్వాన్ని నిందించడంపై చూపిస్తున్న ఆసక్తి, తెలంగాణ నీటి వాటాలపై చర్చ జరపడంలో కనిపించడం లేదని విమర్శించారు.

తెలంగాణకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టుకు ఇచ్చిన జాతీయ హోదాను రద్దు చేయడంతో పాటు, ఆల్మట్టి డ్యాం ఎత్తు తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ నీటి సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదని ఆమె ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *