Kishan Reddy: తెలంగాణ అభివృద్ధి, ప్రాజెక్టుల నిధుల సాధన అంశాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మెట్రో రైలు విస్తరణ ఇంకా కేంద్ర నిధుల నిలిపివేతపై ముఖ్యమంత్రి అవలంబిస్తున్న దుందుడుకు విధానం సరికాదని ఆయన హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తనపై వ్యక్తిగతంగా, కేంద్ర ప్రభుత్వంపై రాజకీయంగా బురదజల్లేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
మెట్రో విషయంలో కేంద్రం ఫుల్ సపోర్ట్ – నిధుల లెక్కలు ఇవే.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును కేంద్రం అడ్డుకుంటోందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలను కిషన్ రెడ్డి కొట్టిపారేశారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 విజయవంతంగా పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.1,200 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. మెట్రో విస్తరణ కోసం కేంద్రం ఎల్లప్పుడూ సహకరిస్తుందని స్పష్టం చేశారు.
మెట్రో రైలు తదుపరి దశల విస్తరణ వేగంగా జరగాలంటే కేవలం కేంద్రంపై ఆరోపణలు చేయడం కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ విషయంలో తానే స్వయంగా గతంలో సీఎం రేవంత్‌కు లేఖ రాశానని వెల్లడించారు.
రేవంత్ కోసమో, కిషన్ కోసమో ప్రాజెక్టులు ఆగవు
రాజకీయ వైరుధ్యాల వల్ల ప్రాజెక్టులు ఆగిపోతాయన్న ప్రచారాన్ని కేంద్రమంత్రి కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి అనుకుంటేనో.. లేదా కిషన్ రెడ్డి వద్దంటేనో ఎక్కడా ప్రజా ఉపయోగకర ప్రాజెక్టులు ఆగవు. కిషన్ రెడ్డి ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేశాడు తప్ప, రాష్ట్రానికి వచ్చే ఏ ఒక్క ప్రాజెక్టునూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అని స్పష్టం చేశారు.
తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన ప్రతిదానికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తాము కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటామని కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో అనేక జాతీయ రహదారులు, రైల్వే లైన్లు ఇంకా విద్యాసంస్థల రూపంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని గుర్తుచేశారు.
IRFC లోన్ వివాదం – కిషన్ రెడ్డి వివరణ:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) రుణాల నిలిపివేత అంశంపై కిషన్ రెడ్డి సాంకేతిక కారణాలను వివరించారు.
రాష్ట్రానికి రావాల్సిన రూ.13,000 కోట్ల ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) లోన్ పెండింగ్‌లో ఉండటానికి అనేక ఆర్థిక, పరిపాలనాపరమైన నిబంధనల లోపాలు కారణాలుగా ఉన్నాయి.
ఈ విషయంలో కేంద్రంపై రాజకీయ బురదజల్లడం మానేసి.. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఒకచోట కూర్చుని ఉమ్మడిగా చర్చించుకుంటే సమస్య పరిష్కారమవుతుందని కిషన్ రెడ్డి హితవు పలికారు.
రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటప్పుడు దురుసుగా వ్యవహరించడం కంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అనవసర రాజకీయ విమర్శలు పక్కనబెట్టి, మెట్రో ఫేజ్-2 మరియు ఇతర పెండింగ్ ప్రాజెక్టుల అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే, తానే స్వయంగా ముందుండి వాటిని మంజూరు చేయిస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
