Pawan Kalyan

Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సూపర్ హిట్’ టూర్.. ఏపీ అటవీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జరిపిన దేశ రాజధాని ఢిల్లీ పర్యటన అత్యంత విజయవంతమైంది. ఏపీ పర్యావరణ, అటవీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల బలోపేతానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని ముగ్గురు కీలక క్యాబినెట్ మంత్రులతో డిప్యూటీ సీఎం వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ సమర్పించిన దాదాపు 7 నుండి 8 అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రతిపాదనలకు కేంద్రం తక్షణమే సానుకూలంగా స్పందించి ఆమోద ముద్ర వేసింది.

1. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ – ఏపీ అటవీ రక్షణకు ‘ఆల్ ఇండియా భవన్’

ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపుదలపై కేంద్ర పర్యావరణ, క్లైమేట్ చేంజ్ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ ప్రభుత్వం కోరిన అన్ని డిమాండ్లకు కేంద్రం పూర్తి సానుకూలత వ్యక్తం చేసింది.

  • ‘హనుమాన్’ (HANUMAN) సెంటర్ ఏర్పాటు: పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో ఒడిస్సా, తమిళనాడు సరిహద్దుల నుండి వచ్చే ఏనుగుల వల్ల పంటలు నాశనమవ్వడం, మనుషుల ప్రాణాలు పోవడం లాంటి ఘర్షణలు నిత్యం జరుగుతున్నాయి. దీని నివారణకు గాను హ్యూమన్-అనిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ సెంటర్ (Human-Animal Conflict Mitigation Center – HANUMAN) ఏర్పాటుకు కేంద్రం తక్షణ అనుమతి ఇచ్చింది.

  • నాలుగు కీలక కేంద్రాల సముదాయం: రాష్ట్రంలో రూపుదిద్దుకోబోయే సరికొత్త ‘ఆల్ ఇండియా భవన్’ భవన సముదాయంలో.. ఈ హనుమాన్ సెంటర్‌తో పాటు గ్రేట్ గ్రీన్ వాల్ మానిటరింగ్ సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఫారెస్ట్, మరియు స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నారు.

  • తీరప్రాంత రక్షణ (కోస్ట్ ఫోర్టిఫికేషన్): ఏపీకి ఉన్న 1051 కిలోమీటర్ల సుదుర్గ తీరప్రాంతంలో సముద్ర కోతను నివారించడానికి, ఉప్పెనల నుండి రక్షణకు గాను ఇప్పటికే 450 కిలోమీటర్ల మేర మడ అడవులు (Mangroves), కాసురినా ట్రీస్ ప్లాంటేషన్ ప్రారంభించామని పవన్ తెలిపారు. దీనికి అదనపు నిధులు కావాలని కోరగా.. కేంద్ర ప్రభుత్వ ‘మిస్టీ’ (MISTHI) పథకం నుండి ప్రత్యేక ఫండ్స్ పంపిస్తామని భూపేంద్ర యాదవ్ హామీ ఇచ్చారు.

2. నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ బలోపేతం

  • బేస్ క్యాంప్‌ల పెంపు – చెంచు యువతకు ఉపాధి: పులుల సంరక్షణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 90 అటవీ బేస్ క్యాంప్‌లను 150 బేస్ క్యాంప్‌లకు పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. దీనివల్ల స్థానికంగా ఉండే 300 మంది చెంచు గిరిజన యువతకు ఫారెస్ట్ వాచర్స్ / గార్డ్స్‌గా సరికొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వారికి కావలసిన మోటార్ బైక్స్, డ్రై రేషన్ ఇంకా ఒక సంవత్సరం పాటు బేస్ క్యాంప్ రన్ చేయడానికి కేంద్ర నిధులు కోసం కోరారు. ఈ ప్రాజెక్ట్ పురోగతిని పర్యవేక్షించడానికి ఆగస్టు 12న ఒక ప్రత్యేక సెంట్రల్ టీమ్ ఏపీకి రానుంది.

  • మధ్యప్రదేశ్ నుండి 50 బోదెద్దులు (Indian Gaur): ఏపీ అడవుల్లో అంతరించిపోతున్న అరుదైన ‘ఇండియన్ గౌర్’ (బోదెద్దులు) సంతతిని పెంచేందుకు గాను మధ్యప్రదేశ్ నుండి 50 వన్యప్రాణులను తెప్పించుకునేందుకు లైన్ క్లియర్ అయింది. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ స్వయంగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌తో మాట్లాడారు. అనంతరం పవన్ కూడా వారితో ఫోన్లో మాట్లాడగా.. ఈ ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ మధ్యలో వీటిని ఏపీకి పంపడానికి ఎంపీ సీఎం అంగీకరించారు.

  • ఇన్-బ్రీడింగ్ నివారణకు 6 కొత్త పులుల తరలింపు: ఏపీ టైగర్ రిజర్వులలో మగ పులుల సంఖ్య పెరిగి, ఆడ పులులు తగ్గిపోవడం వల్ల ఒకే జెనటిక్ పూల్ (In-breeding) ఏర్పడి పులుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని అటవీ అధికారులు గుర్తించారు. జీవ వైవిధ్యం (DNA Diversity) కోసం 6 కొత్త పులులను ఏపీకి తీసుకురానున్నారు. ఇందులో మహారాష్ట్ర నుండి 4 పులుల తరలింపునకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మిగిలిన 2 పులులను మధ్యప్రదేశ్ నుండి తరలించనున్నారు. ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ మాంఝీ సహకారంతో ఏనుగుల దాడిని అదుపు చేయడానికి ప్రత్యేక శిక్షణ పొందిన ‘కుంకీ ఏనుగులను’ (Kumki Elephants) కూడా రప్పించనున్నారు.

3. మిషన్ గోదావరి – నదుల ప్రక్షాళన

గోదావరి నది కాలుష్యంపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రికి నివేదిక ఇచ్చారు. త్వరలోనే గోదావరి పుష్కరాలు రాబోతున్నందున నదిని శుభ్రం చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి.. గోదావరిలో కాలుష్య స్థాయిలను అంచనా వేయడానికి త్వరలోనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) బృందాన్ని ఏపీకి పంపిస్తామని, కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటామని స్పష్టం చేశారు.

4. కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, సీఆర్ పాటిల్‌లతో భేటీ:

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, సీఆర్ పాటిల్‌లను కలిసి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, జలవనరుల ప్రాజెక్టులపై కీలక చర్చలు జరిపారు; ఇందులో భాగంగా ఏపీ పంచాయతీరాజ్ బలోపేతానికి ₹7,770 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతపై చర్చించగా, జలశక్తి శాఖ మంత్రితో జరిగిన అరగంట భేటీలో రాష్ట్రంలో తాగునీటి కొరత సమస్యల పరిష్కారానికి గుజరాత్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘సూరత్ వాటర్ మేనేజ్‌మెంట్ నమూనా’ను ఏపీలో అమలు చేయాలని ప్రతిపాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *