Kurkure: ఒక్కోసారి చిన్న విషయంలో వచ్చే తగాదా జనాల ప్రాణాల మీదకు తెస్తుంది. గోటితో పోయే విషయాన్ని తమ ఈగోతో గొడ్డలి దాకా తెచ్చేవారు చాలామంది ఉంటారు. ఇదిగో అలాంటి వివాదమే కర్ణాటకలో జరిగింది. కుర్ కురే విషయంలో జరిగిన చిన్న వాదన చివరికి 10 మంది గాయాల పాలు కావడానికి.. 25 మంది గ్రామం నుంచి పారిపోవడానికి కారణంగా మారింది.
కర్ణాటకలోని తావణగెరె చెన్నగిరి హొన్నబావి గ్రామానికి చెందిన అతీప్ ఉల్లా కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అదే ఊరిలో సద్దాం అనే వ్యక్తి తన ఇంటి సమీపంలోనే రోడ్డు పక్కన హోటల్ నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం సద్దాం పిల్లలు అతీబ్ ఉల్లా దుకాణానికి వెళ్లి రూ.20కి రెండు ప్యాకెట్ల కుర్ కురే చిప్స్ కొన్నారు. కానీ, వాటి ఎక్స్పైరీ డేట్ అయిపొయింది. అందుకే మరో ప్యాకెట్ ఇవ్వాలని సద్దాం కోరాడు.
ఇది కూడా చదవండి: TRAI: జియో, ఎయిర్ టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ లకు భారీ జరిమానా.. ఎందుకంటే..
Kurkure: దీనికి అతీబ్ ఉల్లా నిరాకరించడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం గ్రామంలో శాంతి లేకుండా చేసింది. గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్నారంటూ సద్దాం చెన్నగిరి పోలీస్ స్టేషన్‌లో అతీబ్ ఉల్లాపై ఫిర్యాదు చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతీబ్ ఉల్లా 30 మందికి పైగా జనంతో కలిసి సద్దాం హోటల్‌కు వచ్చి అతనిపై దాడి చేశాడు. హోటల్‌ను కూడా ధ్వంసం చేశాడు. గొడవ ఆపేందుకు వచ్చిన వారిపై కూడా దాడికి దిగడంతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 10 మంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ముందుజాగ్రత్తగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై కేసు కూడా నమోదైంది. దీంతో అరెస్టు భయంతో 25 మంది గ్రామం నుండి పారిపోయారు.