Evadi Gola Vaadidi: ఈ యేడాది జనవరి 1న మలయాళ చిత్రం ‘మార్కో’ తెలుగులో విడుదలై మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. అత్యంత వయొలెంట్ మూవీగా పేరు తెచ్చుకున్న ‘మార్కో’ విజయం స్ఫూర్తితో ఇప్పుడు మరో మలయాళ చిత్రం తెలుగులో డబ్ కాబోతోంది. అదే ‘ఐడెంటిటీ’. టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడీ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఐడెంటిటీ’ మలయాళంలో రెండు వారాల్లో రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి ఈ యేడాది శుభారంభానికి నాంది పలికింది. అఖిల్ భాయ్, అనాస్ ఖాన్ రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తెలుగులో మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో, చింతపల్లి రామారావు ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. జేక్స్ బెజోయ్ సంగీతం అందించిన ‘ఐడెంటిటీ’ తెలుగు ట్రైలర్ ను నిర్మాతలు సోమవారం విడుదల చేశారు.
