Ys Sharmila: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు ప్రభుత్వం కుల గణన చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ కుల గణనను చారిత్రాత్మకంగా అభివర్ణించిన ఆమె, ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆమె ‘ఎక్స్’ వేదికగా చేసిన ట్వీట్‌లో, “తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే మార్గదర్శకం. ఇది చారిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి. దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ గారి దూరదృష్టికి ఇదొక నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56% బీసీలు, 17% ఎస్సీలు, 10% ఎస్టీలు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది” అని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నామని, కులగణన చేపట్టి వెనుకబడిన వర్గాల సంఖ్యను తేల్చాలని షర్మిల కోరారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో ఎన్ని శాతం వెనుకబడిన వర్గాల ప్రజలున్నారో లెక్కలు తీసి, వారికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల సంఖ్యను గుర్తించి, “మన జనాభాకు అనుగుణంగా రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో ఎవరి వాటా వారికి దక్కేలా చర్యలు తీసుకోవాలి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు కావాలి” అని ఆమె పేర్కొన్నారు.
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కుల గణన చేపట్టినప్పటికీ, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ సర్వే వివరాలు బయటకు రానీయలేదని షర్మిల ఆరోపించారు. బీజేపీ ప్రభావంతోనే సర్వే వివరాలను గోప్యంగా ఉంచారని, బీజేపీ డైరెక్షన్‌లోనే ఆ రిపోర్టును బయటకు రానీయకుండా కుట్ర చేశారని విమర్శించారు.
దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే, రిజర్వేషన్ల రద్దు కోసం బీజేపీ కుట్ర పన్నుతోందని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు బీజేపీ ఒత్తిడికి లోనవకుండా, వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆమెతెలిపారు.