Hyderabad

Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి రేసర్ల హంగామా.. రంగంలోకి దిగిన పోలీసులు.. నెక్స్ట్ ఏం జరిగిందంటే?

Hyderabad: హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ పరిధిలోని మాదాపూర్‌లో అర్ధరాత్రి కొందరు యువకులు బైకులు, కార్లతో నడిరోడ్డుపై తీవ్ర హంగామా సృష్టించారు. వీకెండ్ కావడంతో మాదాపూర్ నీలోఫర్ కేఫ్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై ప్రమాదకరంగా రేసింగ్‌లకు పాల్పడ్డారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ స్థానికులను, ఇతర వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేశారు.

ఈ రేసింగ్‌ల గురించి సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. రోడ్డుపై ప్రమాదకరంగా దూసుకెళ్తున్న రేసర్లను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం కేర్ చేయని పోకిరీలు.. తమ వాహనాలను ఆపకుండా ఏకంగా పోలీసుల వైపునకే వేగంగా దూసించుకుంటూ వెళ్లారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పారిపోవడానికి ప్రయత్నించిన రేసర్లను చుట్టుముట్టి, వెంటాడి మరీ పట్టుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొందరు యువకులు కారు అద్దాలు మూసి లోపలే కూర్చోగా.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కారు అద్దాలను పగులగొట్టి మరీ వారిని బయటకు లాగి అదుపులోకి తీసుకున్నారు. ఈ హంగామాకు కారణమైన పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

వీకెండ్స్ వస్తే చాలు నగరంలోని ప్రధాన రోడ్లపై, ముఖ్యంగా ఐటీ ప్రాంతాలలో ఇలాంటి అర్ధరాత్రి రేసింగ్‌లు, ఆకతాయిల గొడవలు ఎక్కువవుతున్నాయని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైక్ రేసింగ్‌లు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, సాధారణ ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి శాంతిభద్రతల సమస్యలు సృష్టించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ పోలీసులు గట్టిగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *