Maharastra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి భారీ విజయం దక్కింది. ఎగ్జిట్‌పోల్స్ సర్వే అంచనాలను దాటుకొని 200 సీట్ల మార్కును మించి ఫలితాలు సాధ్యమయ్యాయి. అనూహ్య ఫలితాలతో కూటమి పార్టీలు జోష్ మీదుండగా, ప్రత్యర్థి కూటమి అయిన కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ దశలో మహాయుతి కూటమికి ఇంతటి భారీ విజయానికి ఒక్క కారణమంటూ లేకపోగా పలు అంశాలు దోహదపడ్డాయి. కలిసొచ్చిన ప్రధాన అంశాలు ఏమిటో పరిశీలిద్దాం.
లాడ్లీ బెహనా యోజన
Maharastra: మహారాష్ట్రలోని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే నేతృత్వంలోని ప్రభుత్వం అక్కడి మహిళల సాధికారత కోసం లాడ్లీ బెహనా యోజన పథకాన్ని అమలు చేసింది. తొలుత అర్హత కలిగిన ప్రతి మహిళకు రూ.1500 చొప్పున అందజేసింది. ఆ తర్వాత దానిని రూ.2100కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీనిని అమలు చేస్తామన్న హామీతో మహిళా ఓటర్లు అత్యధిక సంఖ్యలో మహాయుతి కూటమి వైపే మొగ్గు చూపారని విశ్లేషకుల అంచనా. అందుకే ఈ భారీ మెజార్టీ సాధ్యమైందని వారు విశ్లేషిస్తున్నారు.
బాలికా, శిశు సంక్షేమ పథకాలు
Maharastra: మహారాష్ట్రలోని బాలికలు, శిశు సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నది. దాంతో నెలనెలా డబ్బులు వస్తుండటంతో సామాన్యులు ఆ ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. ఇవి కూడా మహిళల్లో ఆలోచన కలిగించాయి. దాంతో అత్యధిక మహిళలు మహాయుతి కూటమి వైపు మొగ్గు చూపారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలు
Maharastra: మహాయుతి కూటమిలోని పక్షాలు విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. బీజేపీ సంకల్ప్ పత్ర అని విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని ప్రజాకర్షక పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. మహిళలకు, వృద్ధులకు నెలవారీ భత్యం పెంపు, వచ్చే ఐదేండ్లలో 25 లక్షల ఉద్యోగాల కల్పన, పేదలకు ఆహారం, రుణసాయం, అక్షయ్ అన్న యోజన, పారిశ్రామికీకరణ కోసం రూ.15 లక్షల వరకు జీరో వడ్డీ రుణాల హామీలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోపు విజన్ 2029 ప్రకటన కూడా యువతను ఆకర్షించింది. పంట రుణాల మాఫీ, ఇతర రైతు అనుకూల విధానాలు కూడా బీజేపీ కూటమి భారీ విజయానికి దోహదం చేశాయి.
మహాయుతి కూటమి ఐక్యత
Maharastra: మహాయుతి కూటమి ఐక్యత కూడా ఈ భారీ విజయానికి దోహదం చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ప్రకటించకపోయినా, సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా బీజేపీ, శివసేన, ఎన్‌సీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఐక్యతే వారికి విజయపు బాటలు పరిచింది.
జన బాహుళ్యంలోకి వ్యతిరేక ప్రచారం
Maharastra: మహా అఘాడీ కూటమిపై వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు నమ్మడంతో కూడా మహాయుతి కూటమి ఘన విజయానికి దారితీసింది. వీరి మాటలు జన బాహుళ్యంలోకి చొచ్చుకెళ్లాయి. ఈ దశలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై మహాయుతి కూటమి నమ్మకం కలిగించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాలను తగ్గించడం ద్వారా ముస్లింలకు రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలని కాంగ్రెస్ కూటమి యోచిస్తుందని బహుళ ప్రచారం ఆయా వర్గాల్లో మహాయుతి వైపు మళ్లించింది. వక్ఫ్ బోర్డు అంశం కూడా తెరపైకి వచ్చి ఈ కూటమికి లాభం చేకూరింది.
అజిత్‌పవార్ రాకతో మేలు
Maharastra: ఎన్‌సీపీ చీలికతో బీజేపీ కూటమికి అధిక మేలు కలిగిందని రాజకీయ విశ్లేషకుల అంచనా. శరద్ పవార్ నాయకత్వంలో ప్రబల రాజకీయ పార్టీగా ఉన్న ఎన్‌సీపీని అజిత్‌పవార్ భారీగా చీల్చారని, ముఖ్య నేతలు, క్యాడర్ ఆయన వెంటే తరలివచ్చిందని తెలిపారు. దీంతో ఇది కూడా బీజేపీ కూటమి విజయానికి దారి తీసిందని తేల్చి చెప్పారు.
అండగా నిలిచిన విదర్భ
Maharastra: మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం మహాయుతి కూటమికి అండగా నిలిచింది. భారీ విజయానికి దోహదం చేసింది. చారిత్రకంగా కాషాయకోట అయిన ఈ ప్రాంతం గతంలో లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి కూటమిని చావుదెబ్బ తీసిన ఈ ప్రాంత ప్రజలు ఈ సారి బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రాంతంలో 10 లోక్‌సభ స్థానాలకు 7 స్థానాల్లో ఎంవీఏ కూటమి గెలవగా, కేవలం మూడు స్థానాలకే మహాయుతి కూటమిని పరిమితం చేశారు. అయితే ఈ సారి అక్కడి 62 అసెంబ్లీ స్థానాలకు గాను 40కి పైగా స్థానాల్లో మహాయుతి కూటమి విజయదుందుభి మోగించింది.