Miss Universe 2026: ప్రపంచ అందాల పోటీల చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది! 75వ మిస్ యూనివర్స్ (Miss Universe 2026) విశ్వసుందరి కిరీటాన్ని ఆతిథ్య దేశమైన ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో (Jennifer Barreto) కైవసం చేసుకున్నారు. ప్యూర్టోరికో రాజధాని శాన్ జువాన్‌లోని జోస్ మిగ్యుల్ అగ్రెలోట్ కొలీజియంలో 116 దేశాల సుందరీమణుల మధ్య అత్యంత వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో జెన్నిఫర్ విజేతగా నిలిచారు.
గత ఏడాది విజేత, మెక్సికో సుందరి ఫాతిమా బాష్ (Fatima Bosch) తన వారసురాలైన జెన్నిఫర్ తలపై విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించారు. తాజా విజయంతో ప్యూర్టోరికో ఖాతాలో ఆరోసారి మిస్ యూనివర్స్ కిరీటం చేరడం విశేషం (గతంలో 1970, 1985, 1993, 2001, 2006లో ఆ దేశం టైటిల్ గెలుచుకుంది).
జెన్నిఫర్ బారెటో విజయం మిస్ యూనివర్స్ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైనది. ఈ ప్రతిష్ఠాత్మక కిరీటాన్ని గెలుచుకున్న తొలి వివాహిత, ఒక బిడ్డ తల్లిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ఆమెకు భర్త యాన్ కార్లోస్ బారెటో కాల్డెరాన్, ఏడేళ్ల కుమార్తె పెనెలోప్ ఉన్నారు. 2023లో జరిగిన 72వ ఎడిషన్ వరకు కేవలం అవివాహిత యువతులకు మాత్రమే ఈ పోటీల్లో అవకాశం ఉండేది; ఆ తర్వాత నిబంధనలను సవరించి వివాహితులకు, తల్లులకు మరియు గరిష్ఠ వయోపరిమితిని ఎత్తివేయడంతో జెన్నిఫర్ తన కలను సాకారం చేసుకున్నారు.
కేవలం అందాల పోటీలకే పరిమితం కాకుండా సైకాలజీ, క్లినికల్ సోషల్ వర్క్ విభాగాల్లో రెండు మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసిన జెన్నిఫర్, ప్రస్తుతం అమెరికా ఆర్మీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో ప్రివెన్షన్ స్పెషలిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు. తుది రౌండ్‌లో “ప్రస్తుతం ప్రపంచానికి తన నాయకుల నుంచి అత్యంత అవసరమైనది ఏమిటి?” అని అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. వృత్తిపరమైన సహానుభూతి (Empathy) కలిగిన నాయకులు అవసరమని, ఇతరులను విమర్శించే సమాజంలో ఒక నాయకుడు తన విలువల కోసం నిలబడి ఆదర్శంగా ఉండాలని ఇచ్చిన సమాధానం న్యాయనిర్ణేతలను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్ సుందరి మెలిసా నునెజ్ తొలి రన్నరప్‌గా, వెనిజులా సుందరి క్లారా వేగాస్ గోయెట్జ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఇక భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల లా విద్యార్థిని కజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) టాప్ 30 దశ వరకు చేరుకుని ఆకట్టుకున్నారు. అయితే ఈవెనింగ్ గౌన్ రౌండ్‌కు ముందు టాప్ 12 జాబితాలో చోటు దక్కించుకోలేకపోవడంతో ఆమె ప్రస్థానం అక్కడితో ముగిసింది.
కేరళలోని మావెలిక్కర ప్రాంతానికి చెందిన కజియా, గత ఆగస్టులో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని, ఆ ఘనత సాధించిన కేరళ తొలి మహిళగా గుర్తింపు పొందారు. కాగా, భారత్ ఇప్పటివరకు మూడుసార్లు (1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్ సంధు) విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది.
