Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు?

Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయాల్లో ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం మరోసారి చర్చనీయాంశమైంది. పదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిలదీశారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.

మాట తప్పారు.. ప్రాజెక్టును విస్మరించారు! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్, కేవలం మూడేళ్లలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. కానీ పదేళ్లు గడిచినా ఆ పనులు పూర్తి కాలేదని విమర్శించారు. ఇప్పుడు మాత్రం 90 శాతం పనులు అయిపోయాయని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కృష్ణా నదీ జలాల వినియోగంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.

కుటుంబ పాలన వర్సెస్ ప్రజా పాలన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు అధికారం ఇస్తే, గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని కోమటిరెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఏడాదికి ఒక్కసారే ప్రజల ముందుకు వస్తారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటల పాటు ప్రజల కోసం కష్టపడుతున్నారని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో మద్దతు తెలపండి వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోమటిరెడ్డి కోరారు. భూత్పూర్ పురపాలికలో సుమారు 14 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులే కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *