TS Cabinet Ministers: చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు అయిపోవడంతో మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీ, పార్టీ పదవుల పంపకం ఇలా అన్నింటిని పూర్తి చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ 9నాటికి ఏడాది అవుతుంది. అంతలోపే మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తోందట అధిష్టానం. ఇన్నాళ్లు జిల్లాలు, సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో వాయిదా పడినట్లు హస్తం నేతలు చెబుతున్నారు. అమాత్య పదవి ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆశావహులకు సర్ధి చెప్పి భవిష్యత్‌లో మంచి అవకాశం ఇస్తామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ విషయంలో రాష్ట్ర నేతలకే పూర్తి స్వేచ్చ ఇవ్వాలని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. అందులో నాలుగు మాత్రమే ఫిల్ చేయాలనుకుంటున్నారట. అన్ని భర్తీ చేస్తే… ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు… చాలామంది పదవులపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో రెండు ఖాళీగా ఉంచి.నాలుగు మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు మంత్రుల ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒక్కొక్కరికి బెర్త్ ఖరారు అయినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Talasani Srinivas Yadav: మంత్రి సీతక్క, మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తలసాని సవాల్!
TS Cabinet Ministers: మరోవైపు ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మెదక్ నుంచి ఇద్దరికి అవకాశం ఇస్తారట… ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమంటున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్‌లలో ఒకరికి మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్‌లలో ఒకరికి బెర్త్ ఖరారు అయినట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలనే అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపఎన్నికలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీగణేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే బాగుంటుందని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు టాక్. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలని పార్టీ భావిస్తోందట. మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నీలం మధుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ హైకమాండ్‌కు రెఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సీఎం ఆశీస్సులు కూడా నీలం మధుకు ఉన్నట్లు చెబుతున్నారు.
జిల్లా ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాల ఈక్వేషన్స్‌లో నీలం మధుతో పాటు మహబాబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో ముదిరాజ్ సామాజికవర్గం ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ పేర్లు మంత్రి పదవుల రేసులో వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మైనంపల్లి రోహిత్‌రావు పేరు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమాత్య యోగం దక్కే అదృష్టవంతులు ఎవరనేది కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.