Congress 

Congress: కొండా సురేఖ వివరణ, చిన్నారెడ్డి వ్యవహారాలపై సుదీర్ఘ చర్చ.. పూర్తి ఫిర్యాదులందకా తుది నిర్ణయం!

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశం ముగిసింది.కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ క్రమశిక్షణ, వివాదాస్పద అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశం అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో చోటుచేసుకున్న మూడు ప్రధాన అంతర్గత అంశాలపై కమిటీ విస్తృతంగా చర్చించిందని తెలిపారు.

క్రమశిక్షణ కమిటీ భేటీలో ప్రధాన చర్చనీయాంశాలు:

  • కొండా సురేఖ అంశం & సుస్మిత వ్యాఖ్యలు: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అనుచితమైనవని కమిటీ గుర్తించింది. ఈ వ్యవహారంలో కొండా సురేఖ ఇచ్చిన లిఖితపూర్వక వివరణపైనే ప్రధానంగా చర్చ జరిగింది.
  • ఎమ్మెల్యేల ఫిర్యాదులు – సమగ్ర నివేదిక: కొండా సురేఖ వైఖరిపై పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారని, ఆ లిఖితపూర్వక ఫిర్యాదులన్నీ అందిన తర్వాత వాటన్నింటినీ క్రోడీకరించి తుది నిర్ణయం తీసుకుంటామని మల్లు రవి స్పష్టం చేశారు.
  • చిన్నారెడ్డి వివరణ: వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వ్యవహారంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై సైతం చర్చించారు. దీనిపై చిన్నారెడ్డి స్వయంగా కమిటీ ఎదుట హాజరై తన వాదనను వివరించారని, ఆయన మాట్లాడిన అంశాలన్నింటినీ కమిటీ సభ్యులంతా విన్నారని పేర్కొన్నారు.

పార్టీలో లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవు..

పార్టీలో ఎంతటి నాయకులైనా పార్టీ క్రమశిక్షణ, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని మల్లు రవి స్పష్టం చేశారు. వచ్చిన అన్ని ఫిర్యాదులు, నేతలు సమర్పించిన వివరణలను పరిశీలించిన అనంతరం మరోసారి కమిటీ సమావేశమై తుది నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు, అధిష్టానానికి సమర్పిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *