Blodd Donation: “రక్తదానం.. ప్రాణదానం” అనేది కేవలం ఒక నినాదం కాదు, ఒకరి ప్రాణాన్ని నిలబెట్టే అత్యున్నత మానవీయ కార్యం. శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాదాలు, ప్రసవ సమయాలు లేదా తలసేమియా, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే రోగులకు రక్తం అత్యంత అవసరం అవుతుంది. అయినప్పటికీ, మొదటిసారి రక్తదానం చేయాలనుకునే వారిలో.. “రక్తం ఇస్తే శరీరం బలహీనపడుతుందేమో? కోలుకోవడానికి ఎన్ని నెలలు పడుతుందో?” అనే భయాలు, సందేహాలు ఉంటాయి. అయితే, వైద్య విజ్ఞానం ప్రకారం రక్తదానం అనేది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ. మనం రక్తం ఇచ్చిన మరుక్షణమే మన శరీరం ఒక అద్భుతమైన ‘సెల్ఫ్-రికవరీ’ (స్వీయ పునరుద్ధరణ) ప్రక్రియను ప్రారంభిస్తుంది.
1. ప్లాస్మా (రక్త ద్రవం) రికవరీ – 24 నుండి 48 గంటల్లో..
మన బాడీలో ఉండే రక్తంలో సుమరు 55 శాతం వరకు ప్లాస్మా అనే ద్రవ భాగమే ఉంటుంది. రక్తదానం చేసిన తర్వాత శరీరం ముందుగా ఈ ద్రవ సమతుల్యతను కాపాడటానికి ప్రయత్నిస్తుంది.
ద్రవాల బదిలీ: రక్తనాళాల్లో తగ్గిన పరిమాణాన్ని భర్తీ చేయడానికి శరీరంలోని ఇతర కణజాలాలలో (Tissues) ఉన్న ద్రవాలు వెంటనే రక్తప్రవాహంలోకి చేరుతాయి.
లింఫాటిక్ వ్యవస్థ ప్రవేశం: మన శరీరంలోని లింఫాటిక్ వ్యవస్థ తనలో నిల్వ ఉంచుకున్న ద్రవాలను, అవసరమైన ప్రొటీన్లను వెంటనే రక్తంలోకి విడుదల చేస్తుంది.
దాహం సంకేతాలు: ఈ సమయంలో మూత్రపిండాలు (Kidneys) నీటిని ఆదా చేయడం ప్రారంభిస్తాయి. అలాగే మెదడులోని హైపోథాలమస్ మనకు విపరీతంగా దాహం వేసేలా సంకేతాలు ఇస్తుంది. దీనివల్ల మనం ఎక్కువ నీరు లేదా ద్రవపదార్థాలు తీసుకుంటాం. ఫలితంగా 24 నుండి 48 గంటల్లోపు ప్లాస్మా స్థాయి సాధారణ స్థితికి చేరుకుంటుంది.
2. కొత్త రక్తకణాల ఉత్పత్తి – ఎముక మజ్జ (Bone Marrow) పాత్ర..
రక్త ద్రవం త్వరగా భర్తీ అయినప్పటికీ, రక్తకణాలు పూర్తిగా తిరిగి తయారవడానికి కొంత సమయం పడుతుంది.
ఎరిత్రోపోయిటిన్ (EPO) హార్మోన్: రక్తంలో ఆక్సిజన్ మోసుకెళ్లే ఎర్ర రక్త కణాలు (RBC) తగ్గినట్లు మూత్రపిండాలు గుర్తించిన వెంటనే, అవి ‘ఎరిత్రోపోయిటిన్’ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి.
కణాల ఫ్యాక్టరీ యాక్టివేషన్: ఈ హార్మోన్ మన ఎముకల లోపలి భాగంలో ఉండే మృదువైన కణజాలమైన ఎముక మజ్జను (Bone Marrow) ప్రేరేపిస్తుంది. దీంతో శరీరం శరవేగంగా కొత్త ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. సాధారణంగా 4 నుండి 6 వారాలలోపు ఎర్ర రక్త కణాలు పూర్తిగా పునరుద్ధరించబడతాయి. కాగా, రోగనిరోధక శక్తికి తోడ్పడే తెల్ల రక్త కణాలు (WBC), రక్తం గడ్డకట్టడానికి సాయపడే ప్లేట్‌లెట్లు (Platelets) మాత్రం కేవలం కొన్ని రోజుల్లోనే (వారం రోజుల్లో) పాత స్థితికి వచ్చేస్తాయి.
3. రక్తదానం తర్వాత తల తిరగడం ఎందుకు జరుగుతుంది?
రక్తదానం చేసిన తర్వాత కొందరికి తాత్కాలికంగా అలసట, తల తిరగడం లేదా కాళ్లు చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని వెనుక కొన్ని స్పష్టమైన కారణాలు ఉన్నాయి.
బిపి తగ్గడం (Hypotension): శరీరంలో రక్తం పరిమాణం ఒక్కసారిగా తగ్గడం వల్ల మెదడుకు అందే రక్తప్రసరణ ఇంకా ఆక్సిజన్ కొద్దిసేపు తగ్గుతుంది. దీనివల్ల తల తిరిగినట్లు అవుతుంది.
వాసోవాగల్ రిస్పాన్స్ (Vasovagal Response): ముఖ్యంగా మొదటిసారి రక్తం ఇచ్చే వారిలో ఉండే భయం లేదా ఆందోళన వల్ల నరాల స్పందన ఉత్తేజితమై, గుండె వేగం ఇంకా రక్తపోటు హఠాత్తుగా తగ్గుతాయి. ఫలితంగా కళ్లు తిరుగుతాయి. శరీర బరువు తక్కువగా ఉన్నవారు, యువకులు, నిద్ర లేకుండా లేదా ఖాళీ కడుపుతో రక్తదానానికి వచ్చే వారిలో ఈ సమస్య కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది.
అదనపు సమాచారం: రక్తదాతలు వేగంగా కోలుకోవడానికి గోల్డెన్ టిప్స్:
రక్తదానం చేసిన తర్వాత శరీరం వేగంగా రక్తాన్ని తయారు చేసుకోవడానికి ఇంకా సాధారణ స్థితికి రావడానికి ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి:
హైడ్రేషన్ (ద్రవ పదార్థాలు): రక్తదానం చేసిన మొదటి 24 నుండి 48 గంటల పాటు సాధారణం కంటే కనీసం 1 నుండి 2 లీటర్ల నీరు లేదా పండ్ల రసాలు (O.R.S, మజ్జిక, కొబ్బరినీళ్లు) ఎక్కువగా తాగాలి. ఇది ప్లాస్మాను వేగంగా భర్తీ చేస్తుంది.
ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారం: ఎర్ర రక్త కణాల తయారీకి ‘ఐరన్’ (ఇనుము) అత్యంత కీలకం. కాబట్టి రక్తదానం తర్వాత కొన్ని వారాల పాటు తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు, బీట్‌రూట్, దానిమ్మ, గుడ్లు, లివర్, ఖర్జూరం, ఇంకా బాదం వంటి నట్స్ డైట్‌లో ఎక్కువగా చేర్చుకోవాలి.
విటమిన్ సి (Vitamin C) కాంబినేషన్: మనం తినే ఆహారంలోని ఐరన్‌ను శరీరం త్వరగా శోషించుకోవాలంటే (Absorption) విటమిన్ సి అవసరం. కాబట్టి నిమ్మరసం, నారింజ లేదా కివీ పండ్లను ఆహారంతో పాటు తీసుకోవాలి.
నిషేధించాల్సినవి: రక్తదానం చేసిన తర్వాత కనీసం 24 గంటల పాటు బరువైన వస్తువులను ఎత్తడం, కఠినమైన వ్యాయామాలు (Gym) చేయడం ఆపేయాలి. అలాగే ధూమపానం (Smoking), మద్యపానానికి (Alcohol) దూరంగా ఉండాలి.
రక్తదానం చేసిన తర్వాత కేవలం 24 గంటల్లోనే మన గుండె, మెదడు, మూత్రపిండాలు మరియు కాలేయం వంటి కీలక అవయవాలన్నీ సమన్వయంతో పనిచేసి శరీరాన్ని రక్షణ వలయంలోకి తెస్తాయి. కాబట్టి, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ (18 నుండి 65 ఏళ్ల వయసు, 45 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నవారు) ఎలాంటి భయం లేకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి సురక్షితంగా రక్తదానం చేయవచ్చు.
