Viral News: దేవుడిని అందరూ వింత వింత కోరికలు అడుగుతుంటారు. తాము కోరుకున్న కోరికలు తీరాలని పేపర్ పైన రాసి కొంతమంది ముడుపులు కడితే, మరికొందరు హుండీలో వేస్తుంటారు. కొన్నిసార్లు భక్తులు కోరే కొన్ని వింతైన కోరికలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చాలాసార్లే చూశాం. అలాంటిదే ఇప్పుడు ఇంకొకటి జరిగింది. తన అత్తమ్మ త్వరగా చనిపోవాలని ఒకరు 20 రూపాయల నోటుపైన రాసి దేవుడి హుండీలో వేశారు. అందులో “తమ అత్తమ్మ పెట్టే హింసలు తట్టుకోలేకపోతున్నాను, మా అత్తమ్మను త్వరగా చనిపోయేలా చేయి దేవుడా” అని రాసి ఉంది. ఇప్పుడు ఈ నోటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ హుండీ కానుకలను లెక్కిస్తుండగా ఒక రూ.20 నోటుపై “స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోయేలా చూడు” అని రాసి ఉన్న వింత కోరిక అధికారుల కంటపడింది. భగవంతుడికి సమర్పించిన ఈ వింత వినతిని చూసి అక్కడ ఉన్న ఆలయ అధికారులు, భక్తులు ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు.
దీనిపై సోషల్ మీడియాలో కొంతమంది స్పందిస్తూ.. “ఆమె దేవుడికి తన కోరిక చెప్పుకుంది కాబట్టి సరిపోయింది.. ప్రస్తుతం కొంతమంది వెనకా ముందు చూడకుండా ప్రాణాలు తీస్తున్నారు” అంటూ కామెంట్లు పెట్టాడు.
