Weather: అండమాన్ సముద్రంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈనెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ తర్వాత రెండు రోజుల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, సీమ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ 26, 26 తేదీల్లో భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది. తీర ప్రాంతం వెంట బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో 24 నుంచి తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, కోస్తాలో బుధవారం చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.మరోవైపు ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.