Navratri 2026: హిందూ సనాతన ధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగల్లో ‘శారదీయ నవరాత్రులు’ (శరన్నవరాత్రులు) ప్రధానమైనవి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను తొమ్మిది విశిష్ట రూపాల్లో అలంకరించి భక్తులు పూజలు నిర్వహిస్తారు. 2026 సంవత్సరంలో శారదీయ నవరాత్రులు ఆదివారం, అక్టోబర్ 11 నుంచి ప్రారంభమై.. అక్టోబర్ 20న విజయదశమి (దసరా) ముగింపుతో వైభవంగా జరగనున్నాయి. మొదటి రోజైన అక్టోబర్ 11న కలశ స్థాపన (ఘటస్థాపన)తో అమ్మవారి ఉత్సవాలు మొదలవుతాయి.
జ్యోతిష్య, దేవీ భాగవత శాస్త్ర విశ్వాసాల ప్రకారం.. అమ్మవారి శాశ్వత వాహనం ‘సింహం’ అయినప్పటికీ, నవరాత్రుల సమయంలో భూలోకానికి వచ్చేటప్పుడు (ఆగమనం), తిరిగి వెళ్లేటప్పుడు (నిష్క్రమణ/ప్రస్థానం) నవరాత్రులు ప్రారంభమయ్యే, ముగిసే వారాల (రోజుల) ఆధారంగా ప్రత్యేక వాహనాల్లో వస్తారని ప్రగాఢ విశ్వాసం. ఆ వాహనాలు లోకంలో రాబోయే పరిస్థితులు, శుభాశుభ ఫలితాలను సూచిస్తాయని చెబుతారు.
ఏ వారం మొదలైతే అమ్మవారు ఏ వాహనంపై వస్తారు? (ఆగమన వాహనాలు)..
నవరాత్రులు ప్రారంభమయ్యే రోజు ఆధారంగా అమ్మవారి ఆగమన వాహనం నిర్ణయమవుతుంది..
-
ఆదివారం లేదా సోమవారం – ఏనుగు (గజం):నవరాత్రుల ప్రారంభం ఆదివారం గానీ, సోమవారం గానీ పడితే జగన్మాత ఏనుగుపై తరలివస్తుంది. ఏనుగు శుభానికి, సమృద్ధికి సంకేతం. ఈ వాహనంపై అమ్మవారు వస్తే దేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండి ధనధాన్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతారు.
-
మంగళవారం లేదా శనివారం – గుర్రం (అశ్వం):ఈ రెండు వారాల్లో నవరాత్రులు ప్రారంభమైతే గుర్రంపై వస్తారు. గుర్రం వేగానికి, మార్పునకు ప్రతీక. సమాజంలో పెద్ద మార్పులు, రాజకీయ సంక్షోభాలు, దేశాల మధ్య ఉద్రిక్తతలు లేదా అధికార మార్పులకు ఇది సూచికగా భావిస్తారు.
-
బుధవారం – పడవ (నౌక):బుధవారం ఉత్సవాలు మొదలైతే నౌకపై వస్తారు. పడవ సమస్యలను దాటించే సాధనం. సర్వజనుల మనోభీష్టాలు నెరవేరడం, కష్టాలు తీరడం, కల్యాణప్రదమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.
-
గురువారం లేదా శుక్రవారం – పల్లకి (డోలీ):గురువారం లేదా శుక్రవారాల్లో మొదలైతే అమ్మవారు పల్లకిలో వస్తారు. దీనిని కొంత అశుభ సూచకంగా భావిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు లేదా ఆర్థిక సంక్షోభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతాయి.
విజయదశమి రోజున అమ్మవారి తిరుగు ప్రయాణం (ప్రస్థాన వాహనాలు)..
నవరాత్రుల ముగింపు రోజైన విజయదశమి (దశమి తిథి) ఏ వారంలో వచ్చిందో చూసి అమ్మవారి నిష్క్రమణ వాహనాన్ని లెక్కిస్తారు:
-
ఆదివారం లేదా సోమవారం – దున్నపోతు (మహిషం):ఈ రోజుల్లో దసరా ముగిస్తే మహిషంపై వెళ్తారు. ఇది లోకంలో కొంత దుఃఖం, అశాంతి పెరుగుదలకు సూచన.
-
మంగళవారం లేదా శనివారం – కోడి పుంజు / చరణాయుధం (కుక్కుటం):విజయదశమి మంగళ లేదా శనివారాల్లో వస్తే అమ్మవారి వాహనం కుక్కుటం. ఇది ప్రజల మధ్య అంతర్గత కలహాలు, అశాంతి, ఒత్తిళ్లు పెరిగేందుకు సంకేతంగా పరిగణిస్తారు.
-
బుధవారం లేదా శుక్రవారం – ఏనుగు (గజం):ఈ రోజుల్లో అమ్మవారు ఏనుగుపై ప్రస్థానం చేస్తే సర్వతోముఖాభివృద్ధి, శుభం, మానవాళికి శ్రేయస్సు లభిస్తుంది.
-
గురువారం – పల్లకి (డోలి):గురువారం నాడు అమ్మవారు పల్లకిపై తిరుగు ప్రయాణమైతే దేశంలో శాంతిభద్రతలు బాగుంటాయని, సౌభాగ్యం వర్ధిల్లుతుందని విశ్వసిస్తారు.
2026 శారదీయ నవరాత్రుల విశిష్టత..
-
ఆగమనం (రాక):2026లో శారదీయ నవరాత్రులు ఆదివారం (అక్టోబర్ 11న) ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ ఏడాది జగన్మాత ‘ఏనుగు’ (గజం) వాహనంపై భువికి విచ్చేస్తున్నారు. ఇది సమాజానికి అత్యంత శ్రేయస్కరమైన, సుభిక్షమైన శుభ సంకేతం.
-
ప్రస్థానం (వీడ్కోలు):విజయదశమి పర్వదినం మంగళవారం (అక్టోబర్ 20న) వస్తోంది. కాబట్టి ప్రస్థాన వాహనంగా ‘చరణాయుధం’ (కోడిపుంజు) నిర్ధారితమైంది. ఇది సమాజంలో అంతర్గత కలహాలు, విభేదాలు రాకుండా ప్రజలు, పాలకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించే సూచనగా జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ పది రోజుల పాటు భక్తులు నియమనిష్టలతో ఉపవాసాలు ఉంటూ, దుర్గా సప్తశతి పారాయణలు, లలితా సహస్రనామ పూజలతో అమ్మవారి కృపకు పాత్రులవుతారు.
