Vijayawada: ఒక్క అమ్మాయి వల్ల చిన్నపాటి ప్రాణస్నేహితులు కూడా విడిపోతారు, చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్తారు.. అలాంటి ఘటన తాజాగా ఒకటి చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే తమ వాహనాలతో ఒకరిని ఒకరు ఢీకొట్టుకున్నారు. ఇది చూసిన జనం అక్కడి నుండి పారిపోయారు.. పోలీసులు రావడంతో ఆగిన గొడవ. విజయవాడలో ఈ ఘటన జరిగింది.
అసలు విషయానికి వస్తే.. తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. విజయనగర్ కు చెందిన బొల్లా ఓమ్ తనతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. వైసీపీ నేత జోగి రమేష్ తనకు బంధువు అని చెప్పుకునేవాడు బొల్లా ఓమ్.
ఇప్పటివరకు బాగానే ఉంది కానీ ఇద్దరి మధ్యలోకి ఓ యువతి వచ్చింది. ఆమెకి సంబంధించి ఓ విషయం పైన రోహిత్‌కు ఓమ్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావ్ అని కోపంగా అడగడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. తాను పటమట ఆర్‌ఆర్ గార్డెన్‌లోని హైటెన్షన్ రోడ్డులో ఉన్నానని చెప్పాడు. ఇద్దరు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు.
తన థార్ జీప్ పైన రోహిత్ ఉన్న ప్లేస్ కి గురువారం రాత్రి వెళ్లాడు ఓమ్. వేగంగా వచ్చి రోహిత్ ఉన్న జీప్ ని ఢీకొట్టాడు ఓమ్. దీంతో ఇద్దరు ఒకరి వాహనాన్ని ఇంకొకరు గట్టిగా ఢీకొట్టుకున్నారు. ఇలా గుద్దుకుంటూ 100 మీటర్ల వరకు వెనక్కి ముందుకు తిప్పుతూ ఢీకొట్టుకున్నారు. అదే సమయంలో అక్కడ వాకింగ్ చేస్తున్న వారు, ఇంకా జనం ఈ గొడవను చూసి భయంతో అక్కడి నుండి వెళ్లిపోయారు.
ఎట్టకేలకు పటమట పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి రోహిత్ తన జీప్ ని వదిలేసి పరారయ్యాడు. ఓమ్ దొరికిపోయాడు. అతడిని స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పవన్‌కిషోర్ తెలిపారు. గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో ఓ యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లు తెలిసింది.
